తనకు కరోనా లక్షణాలు ఉన్నవిషయం దాచిపెట్టిన పెళ్ళికొడుకు పెళ్లైన రెండు రోజులకే మృతిచెందాడు. దీంతో అసలు విషయమంతా బయటపడింది. పెళ్లికి హాజరైన వారికి కరోనా పరీక్షలు నిర్వహించగా వారిలో 95 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. బిహార్‌ రాష్ట్రంలోని పాలిగంజ్‌ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి గురుగ్రామ్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. కరోనా లక్షణాలు ఉన్నప్పటికీ పరీక్షలు చేయించుకోకుండా వివాహం చేసుకున్నాడు. ఈ వేడుక జరిగిన రెండు రోజులకు వరుడి ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో పట్నాలోని ఎయిమ్స్‌కు తీసుకెళ్తుండగా దారి మధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు.

వరుడు మరణించడంతో అధికారులకు సమాచారం ఇవ్వకుండానే కుటుంబ సభ్యులు అతడి దహన సంస్కరణ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా ప్రభుత్వ అధికారులు వివాహానికి హాజరైన దగ్గరి బంధులవులకు కరోనా పరీక్షలు నిర్వహించడం ప్రారంభించారు. వీరిలో 15 మందికి పాజిటివ్‌గా తేలగా అతిథులందరికీ పరీక్షలు చేశారు. వీరిలో సోమవారం 80 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. పెళ్లికి హాజరైన వారిలో 95 మంది కరోనా బారిన పడినట్లు రిపోర్టులు వెలువడగా పెళ్లి కూతురుకి మాత్రం నెగిటివ్‌ వచ్చింది.