కరోనా వైరస్ దెబ్బకు ఇండియాలో ప్రాపర్టీ ధరలు కూడా భారీగా పతనమయ్యాయి. ఈ పదేళ్లలో ఇండియన్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌‌లో మొట్టమొదటిసారి భారీగా ప్రైస్ కరెక్షన్‌‌ (ధరలు తగ్గినట్టు) వచ్చినట్టు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. కరోనా వల్ల దేశవ్యాప్తంగా బిజినెస్‌‌లు ఎక్కడివి అక్కడ స్తంభించిపోవడంతో, రియల్ ఎస్టేట్ మార్కెట్ కూడా పడిపోయిందని పేర్కొన్నాయి. ‘ప్రాపర్టీ ధరలు అన్ని ప్రాంతాల్లో సుమారు 10 శాతం నుంచి 20 శాతం పడిపోయే అవకాశం ఉంది. అదేవిధంగా ల్యాండ్ ధరలు అత్యధికంగా 30 శాతం వరకు తగ్గుతున్నాయి’ అని రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ లియాసెస్ ఫోరాస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పంకజ్ కపూర్ తెలిపారు.

ఇది వరకు సంక్షోభం వచ్చినప్పుడు కూడా ఇంత కరెక్షన్‌‌ కనిపించలేదని చెప్పారు. అప్పటి నుంచి ఎన్‌‌బీఎఫ్‌‌సీ సంక్షోభం ఉన్నప్పటికీ, చాలా మార్కెట్లలో ధరలు పెరుగుతూనే ఉన్నాయని తెలిపారు. షాడో బ్యాంకుల్లో లిక్విడిటీ కొరత తీవ్రం కావడంతో, గతేడాది మాత్రం పరిస్థితి మారిందన్నారు. దీంతో చాలా మంది డెవలపర్లు, ప్రాపర్టీ కొనుగోలుదారులు డిస్కౌంట్లను ఆఫర్ చేయాల్సి వచ్చిందన్నారు. కరోనా వల్ల పరిస్థితి మరింత దారుణంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. కొనుగోలుదారులు ఇప్పుడు ప్రాపర్టీ ధరలు మరింత తగ్గుతాయని భావిస్తున్నారు.

పేరుకుపోతున్న ఇన్వెంటరీ:

‘ఇది పూర్తిగా బయర్‌‌ మార్కెట్. ఒకవేళ ఎవరైనా నిజంగా డీల్ కుదుర్చుకోవాలనుకుంటే, ధరలను తగ్గించాల్సిందే’ అని ముంబైలోని రహేజా రియాల్టీ సంస్థకు చెందిన రామ్ రహేజా తెలిపారు. దేశవ్యాప్తంగా నాలుగు నుంచి ఐదేళ్ల రియల్ ఎస్టేట్ ఇన్వెంటరీ ఉంది. ఇదే ఆల్‌‌ టైమ్ హై ఇన్వెంటరీ. ఇప్పుడు పరిస్థితి చాలా దారుణంగా ఉందన్నారు. ఆన్‌‌లైన్ రియల్ ఎస్టేట్ పోర్టల్ ప్రాప్‌‌టైగర్ జనవరి రిపోర్ట్ ప్రకారం దేశవ్యాప్తంగా ఉన్న తొమ్మిది మేజర్ రెసిడెన్షియల్ మార్కెట్లలో రూ.6 లక్షల కోట్ల అమ్ముడుపోని యూనిట్లు ఉన్నట్టు తెలిసింది. ఒకవేళ డెవలపర్లు తమ స్టాక్స్‌‌ ను లిక్విడేట్ చేసుకోలేకపోతే, డిఫాల్ట్ పెరుగుతాయని బ్యాంక్‌‌లు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

బ్యాంకుల్లో మొండి బకాయిలకు మరో 140 బిలియన్ డాలర్లు యాడ్ అవుతాయని తెలుస్తోంది. గత కొన్ని క్వార్టర్ల నుంచి పడిపోతున్న రియల్ ఎస్టేట్ మార్కెట్‌‌ను కోలుకునేలా చేయడానికి ప్రభుత్వం కూడా పలు చర్యలు తీసుకుంటోంది. డబ్బులు లేక చాలా ప్రాజెక్ట్‌‌ లు స్ట్రక్ అయ్యాయి. కొనుగోలుదారుల వద్ద ఫండ్స్ ఉండటం లేదు. దీంతో లిక్విడిటీకి బూస్టప్ ఇస్తోంది ఈ సమయంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ వైరస్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌‌ను మరింత దెబ్బకొడుతోందని డెవలపర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.