భారత్‌లో రోజురోజుకూ రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో అత్యధికంగా దాదాపు 9,887 పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. దేశంలో కరోనా వైరస్‌ వెలుగులోకి వచ్చిన తర్వాత ఒక్కరోజు వ్యవధిలో ఈ స్థాయి కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి. దీంతో శనివారం నాటికి దేశంలో కొవిడ్‌-19 బారినపడ్డ వారిసంఖ్య 2,36,657కు చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ప్రకటించింది. గడచిన 24 గంటల్లో దేశంలో అత్యధికంగా 294 మంది కొవిడ్‌ రోగులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో ఇప్పటివరకు కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 6,642కు చేరింది.

దేశంలో కరోనా వైరస్‌ సోకిన వారిలో ఇప్పటివరకు 1,14,072 మంది కోలుకోగా మరో 1,15,942 మంది చికిత్స పొందుతున్నారు. ప్రపంచంలో కొవిడ్‌-19 కేసులు అధికంగా నమోదవుతున్న దేశాల జాబితాలో ఇటలీని దాటి భారత్‌ ఆరో స్థానానికి చేరింది. 2,34,531 కేసులతో ఇటలీ ప్రస్తుతం ఏడో స్థానంలో ఉండగా..1,87,400 కేసులతో పెరూ ఎనిమిదో స్థానానికి ఎగబాకింది. 19,35,432 కేసులతో అమెరికా అగ్రస్థానంలో కొనసాగుతోంది.