కరోనా కంటే కరోనా సోకిందనే భయమే ఎక్కువసార్లు మనుషుల ప్రాణాలు తీస్తోంది. దీనికి తాజా ఉదాహరణ వృద్ధ జంట ఆత్మహత్య. కరోనా సోకిందన్న అనుమానం, తమ ద్వారా మనవళ్లకు వైరస్ సోకుతుందేమోనన్న ఆందోళన.. వారిని ఆత్మహత్యకు ప్రేరేపించాయి. తమ కారణంగా మనవళ్లకు వ్యాధి సోకుతుందనే భయంతో.. చివరకు ఆత్మహత్య చేసుకుని ప్రాణ త్యాగం చేశారు. హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో రాజ్ నగర్ లో ఈ దుర్ఘటన జరిగింది. వెంకటేశ్వరనాయుడు(65), వెంకటలక్ష్మి(60) దంపతులకు ఇద్దరు కొడుకులు.

ఎవరి కుటుంబాలతో వారే విడివిడిగా ఖైరతాబాద్ లో నివాసం ఉంటున్నారు. మనవళ్లు రోజూ ఆడుకునేందుకు తాతయ్య, నాన్నమ్మ వద్దకు వస్తుండేవారు. పది రోజుల నుంచి వెంకటేశ్వరనాయుడు, వెంకటలక్ష్మికి జ్వరం వస్తుండడంతో కరోనా అని అనుమానించి మనవళ్లను తమ వద్దకు రావద్దని చెప్పారు. ఆసుపత్రిలో చేర్పించినా చనిపోతామన్న ఆందోళన పెరిగింది. దీంతో పాటు మనవళ్లు తమ ఇంటికి వస్తామంటూ మారాం చేస్తుండటంతో వీరిలో ఆందోళన మరింత పెరిగింది. తాము చనిపోయినా మనవళ్లు బాగుండాలని కోరుతూకూల్ డ్రింక్ లో పురుగు మందు కలుపుకొని తాగి చనిపోయారు.