దిల్లీ: కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధానికి దేశవ్యాప్తంగా ఈ నెల 16 నుంచి టీకా పంపిణీ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్‌ సమయంలో పాటించే నియమ నిబంధనలు, చేయాల్సినవి, చేయకూడనివి చెబుతూ కేంద్రం అన్ని రాష్ట్రాలకు రూల్‌బుక్‌ పంపించింది. 18ఏళ్లు పైబడిన వారికే టీకా ఇవ్వాలని, గర్భిణీలు, బాలింతలకు వ్యాక్సిన్‌ ఇవ్వకూడదని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ రాష్ట్రాలకు రాసిన లేఖల్లో పేర్కొంది.

ఇవి గుర్తుంచుకోవాలి:

  • 👉 కొవిడ్‌ 19 వ్యాక్సిన్లకు మార్చుకునేందుకు అనుమతి ఉండదు. తొలి డోసు ఏ సంస్థకు చెందిన టీకా తీసుకుంటారో, రెండో డోసు కూడా అదే రకం టీకా తీసుకోవాలి.
  • 👉యాంటీబాడీలు లేదా ప్లాస్మా చికిత్స తీసుకున్న కరోనా రోగులు, ఇతర జబ్బుల కారణంగా తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారు, ఆసుపత్రుల్లో చికిత్స పొందే రోగులకు వారు కోలుకున్న నాలుగు నుంచి ఎనిమిది వారాల తర్వాతే కొవిడ్‌ టీకా ఇవ్వాలి.
  • 👉 గర్భిణీలు, పాలిచ్చే తల్లులపై ఇప్పటివరకు కొవిడ్‌ టీకా క్లినికల్‌ పరీక్షలు జరగలేదు. అందువల్ల ప్రస్తుతం అలాంటి మహిళలకు టీకా ఇవ్వకూడదు.
  • 👉 కచ్చితంగా 18ఏళ్ల పైబడిన వారికే వ్యాక్సినేషన్‌ ఇవ్వాలి. ఒకవేళ ఇతర టీకాలు తీసుకోవాల్సిన అవసరం వస్తే కొవిడ్‌ టీకాకు, వాటికి కనీసం 14 రోజుల వ్యవధి ఉండాలి.
  • 👉 టీకా తీసుకునే వ్యక్తులకు మందులు, టీకా, ఆహార పదార్థాల అలర్జీ ఉందేమో తెలుసుకోవాలి. అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి.
  • 👉టీకా తీసుకున్న తర్వాత ఏదైనా నొప్పి లేదా బాధగా అనిపిస్తే పారాసిటమల్‌ తీసుకోవచ్చు అని ఆరోగ్యశాఖ లేఖలో వెల్లడించింది.
  • 👉దేశవ్యాప్తంగా 3006 కేంద్రాల్లో రేపటి నుంచి టీకా పంపిణీ ప్రారంభం కానుంది. శనివారం ఉదయం 10.30 గంటలకు ప్రధాని మోదీ వర్చువల్‌ విధానంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు కేంద్రం వెల్లడించింది. తొలి రోజు 3 లక్షల మంది ఆరోగ్య కార్యకర్తలకు టీకా పంపిణీ చేయనున్నారు. వ్యాక్సిన్‌ పంపిణీపై తలెత్తే సందేహాలను నివృత్తి చేసేందుకు వీలుగా ప్రత్యేక కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఇందుకోసం 1075 టోల్‌ ఫ్రీ నెంబరు కూడా ఏర్పాటు చేశారు.