కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ కేంద్ర మంత్రి జైపాల్‌ రెడ్డి(77) కన్నుమూశారు. కొద్దిరోజులుగా నిమోనియాతో బాధపడుతున్న ఆయన గచ్చిబౌలిలోని ఏషియన్‌ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ ఆదివారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. కాగా ఆయన భౌతికకాయాన్ని జూబ్లిహిల్స్‌లోని స్వగృహానికి తరలించారు.

నాలుగు సార్లు MLA ఐదుసార్లు ఎంపీగా:

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా మాడ్గుల గ్రామంలో 1942 జనవరి,16న జైపాల్‌రెడ్డి జన్మించారు. 1969 నుంచి 1984 మధ్యకాలంలో నాలుగుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఎమర్జెన్సీ కాలంలో కాంగ్రెస్‌ను వీడి జనతా పార్టీలో చేరారు. 1980లో మెదక్‌ నుంచి ఇందిరాగాంధీపై పోటీచేసి ఓడిపోయారు. 1985 నుంచి 1998 వరకు జనతాపార్టీ జనరల్‌ సెక్రటరీగా పనిచేశారు. 1999లో కాంగ్రెస్‌లోకి తిరిగొచ్చారు. ఐదుసార్లు ఆయన ఎంపీగా గెలుపొందారు. 1984, 1998, 1999, 2004, 2009లో ఆయన ఎంపీగా పనిచేశారు. 1990, 1997లో రెండుసార్లు రాజ్యసభ ఎంపికయ్యారు. 1991-92లో రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు.