ఆర్టీసీ చార్జీల పెంపుపై కాంగ్రెస్ నాయకులు రెండురోజులుగా మాట్లాడుతున్న తీరు రెండు నాలుకల ధోరణికి నిదర్శనమని మండలిలో ప్రభుత్వ విప్ కర్నె ప్రభాకర్ ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లోని టీఆర్‌ఎస్‌ఎల్పీలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన ఎమ్మెల్యేలు బాలరాజు, చందర్‌తో కలిసి మాట్లాడారు. ఆర్టీసీని బతికించేందుకు తప్పనిపరిస్థితుల్లో చార్జీలు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ప్రజామోదం లభించిందని కర్నె చెప్పారు. చార్జీల పెంపునకు వ్యతిరేకంగా కాంగ్రెస్ గాంధీభవన్‌లో తలపెట్టిన ధర్నా అట్టర్‌ఫ్లాప్ కావడమే దీనికి నిదర్శనమని చెప్పారు. ధర్నాకు ప్రజలు, కార్యకర్తలు కాదు, నాయకులు కూడా రానిదుస్థితిలో రద్దు చేసుకొన్నారని ఎద్దేవాచేశారు.

ఆ పార్టీ నాయకుల తీరు శవానికి అలంకరణ చేసినట్టుగా ఉన్నదని, చివరకు కాంగ్రెస్సే శవంలా మిగులుతుందని దుయ్యబట్టారు. ఆర్టీసీని ప్రైవేటీకరించవద్దని, నష్టాల బారినుంచి రక్షించడానికి చార్జీలను పెంచాలని డిమాండ్‌చేసిన కాంగ్రెస్ నాయకులే, చార్జీల పెంపును తప్పుపట్టడం సిగ్గుచేటని విమర్శించారు. డీజిల్ రూ.45 ఉన్నప్పుడే చార్జీలు పెంచారని, ఇప్పుడు రూ.70కి పైగా ఉన్నప్పటికీ చార్జీలు ఎందుకు పెంచడం లేదని, ఎందుకు ప్రైవేటీకరణవైపు పోతున్నారని సరూర్‌నగర్‌లో కాంగ్రెస్ నాయకులు, వారి సన్నిహితుడైన కోదండరాం చేసిన వ్యాఖ్యలను గుర్తుకు తెచ్చుకోవాలని కోరారు. దేశంలోనే మానవత్వం ఉన్న నేత ఉన్నారంటే అది కేసీఆర్ మాత్రమేనని, ఆయన మనసున్న మహానేత, జనహృదయ విజేత అని వర్ణించారు. ఆర్టీసీ వ్యవహారంలో సీఎం కేసీఆర్ అనుసరించిన తీరుతో కాంగ్రెస్ నాయకుల మైండ్‌బ్లాంక్ అయ్యిందని, అందుకే గుడ్డి ద్వేషంతో విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. పొన్నాల లక్ష్మయ్య, జగ్గారెడ్డి తదితరులు కాంగ్రెస్ టూరింగ్ టాకీస్ నాయకులని ఎద్దేవాచేశారు.

పాతాళంలో పూడ్చినా బుద్ధి రాలేదు: ఎమ్మెల్యేలు బాలరాజు, చందర్

కేద్రం విచ్చలవిడిగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతుంటే ప్రజలపక్షాన గళమెత్తని కాంగ్రెస్, ఆర్టీసీని రక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం చార్జీలు పెంచితే నానాయాగీ చేస్తున్నదని ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, కోరుకంటి చందర్ విమర్శించారు. కాంగ్రెస్‌ను ప్రజలు పాతాళంలో పూడ్చినా నాయకులకు బుద్ధిరావడంలేదని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో సింగరేణి, ఆర్టీసీ కార్మికుల పాత్ర మరువలేనిదని, అందుకే సీఎం కేసీఆర్ వారిపై అభిమానాన్ని ప్రదర్శిస్తున్నారని చెప్పారు.