‌కాజీపేట రెండో ఆర్వోబీ నిర్మాణం కోసం రైల్వే శాఖ ప్రభుత్వాన్ని మరో రూ. 3.76 కోట్లు అడిగింది. తాజాగా రహదారులు భవనాల శాఖకు లేఖ అందింది. ప్రస్తుతం ఉన్న వంతెన ఇరుకు కావడంతో దీని పక్కనే రెండోది నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. భూసేకరణతో సహ వంతెన నిర్మాణ వ్యయాన్ని అంచనా వేసి రూ. 78 కోట్లను మంజూరు చేసింది. అయితే రైల్వే తమ భూమిని కేటాయించాల్సి ఉంది. దీని కోసం 35 ఏళ్లకు లీజు ప్రాతిపదికన ప్రభుత్వం రైల్వే శాఖకు రెండు దఫాలుగా గతంలోనే మొత్తం రూ. 3.88 కోట్లు చెల్లించింది. ఈ నిధులకు అదనంగా మరో రూ. 3.76 కోట్లు చెల్లించాలని తాజాగా లేఖ రాసింది. ప్రస్తుతం ఉన్న విద్యుత్తు స్తంభాలు, లైన్లను తీసి మరో చోట కొత్తవి నిర్మించడంతో పాటు, నీటి సరఫరా పైపులైన్లను తొలగించి కొత్తగా నిర్మించాల్సి ఉంటుందని, ఇంకా కొన్ని రైల్వే క్వార్టర్లను తొలగించడంతో పాటు ప్రహరీ నిర్మాణం చేపట్టేందుకు అదనపు నిధులు అవసరమని లేఖలో పేర్కొంది.

రహదారులు భవనాల శాఖ పర్యవేక్షక ఇంజినీరు సత్యనారాయణ ఆ లేఖను ప్రభుత్వానికి పంపారు. మళ్లీ నిధులు మంజూరు చేయడానికి కొన్ని నెలల సమయం పట్టే వీలుంది. తాజాగా పరిణామాల నేపథ్యంలో వంతెన నిర్మాణం ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకవైపు రైల్వే భూములు ఉండగా, వంతెనకు మరోవైపు రెవెన్యూ శాఖ భూసేకరణ చేపడుతోంది. మొత్తం మూడెకరాల భూ సేకరణ కావాల్సి ఉండగా ఇప్పటికే నోటిఫై చేసి ప్రైవేటు సంస్థల యాజమాన్యాలకు బిల్లులు చెల్లిస్తోంది. కాజీపేట వద్ద రోజురోజుకు వాహనాల రద్దీ పెరగడంతో రెండో వంతెన ఆవశ్యకత ఏర్పడింది. 2017లో అక్టోబరులో వంతెన నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఏడాదిలోపు వంతెన పూర్తయి, ప్రారంభోత్సవం జరగాల్సి ఉన్నా, మూడేళ్లు దగ్గర పడుతున్నా నిర్మాణం మొదలుకాకపోవడం విమర్శలకు తావిస్తోంది.