కాళ్ల పారాణి ఆరకముందే నవ వధువు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని వై. సీతానగరంలో శుక్రవారం చోటుచేసుకుంది. ఆమె మృతి పెళ్లి ఇంట తీవ్ర విషాదాన్ని నింపింది. కాగా మృతురాలు ఇటీవల లవ్‌ ఫెయిల్యూర్‌ కథనాంశంగా రూపొందించిన హరర్‌ షార్ట్‌ ఫిలిమ్‌లో ప్రధాన పాత్రలో నటించినట్టు సమాచారం. మండపేట రూరల్‌ పోలీసులు, స్థానికులు తెలిపిన సమాచారం మేరకు మండలంలోని వై. సీతానగరానికి చెందిన మహదాసు శ్రీను, మంగ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తె రమ్య శ్రీదేవి (20) డిగ్రీ చదువుతోంది. రమ్య శ్రీదేవికి పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం మండలం లక్ష్మణ ఈశ్వరం గ్రామానికి చెందిన మేనమామతో బుధవారం తల్లిదండ్రులు వివాహం జరిపించారు.

శనివారం ఆమెను అత్తవారి ఇంటికి పంపాల్సి ఉంది, కాగా శుక్రవారం ఆమె ఎలుకల మందు తిని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు హుటాహుటిన మండపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆమెను కాపాడేందుకు వైద్యులు, సిబ్బంది తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకపోయింది. తహసీల్దార్‌ సీహెచ్‌ నాగలక్ష్మి సంఘటన స్థలానికి చేరుకుని శవపంచనామా నిర్వహించారు. అల్లారు ముద్దుగా పెంచిన కూతురు కాళ్ల పారాణి ఆరకముందే అఘాయిత్యానికి పాల్పడటంపై తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఇన్‌చార్జి ఎస్‌ఐ శివప్రసాద్‌ పర్యవేక్షణలో రూరల్‌ హెచ్‌సీ మూర్తి కేసు నమోదుచేశారు. ఇష్టం లేని పెళ్లి కావచ్చని, లేదా చదువు ఆగిపోతుందన్న బాధతోనైనా ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా మృతురాలి ఫోన్‌ కాల్‌డేటా వివరాలు సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.