రెండు కిడ్నీలకు కలిపి రూ.10 కోట్లు వస్తుంటే రూ.4లక్షలు ఇవ్వడం ఓ లెక్కా అని వెంటనే ఇచ్చేశారు. ఆ తర్వాత మరోసారి డబ్బులు అడగడంతో అనుమానం వచ్చి డబ్బులు ఇవ్వలేదు. కరోనా వల్ల వ్యాపారం పూర్తిగా దెబ్బతిని ఆర్థికంగా అల్లాడిపోయారు. చేసిన అప్పును కట్టే పరిస్థితి లేకపోవడంతో కిడ్నీలు అమ్ముదామని అనుకున్నారు. ఆ డబ్బుతో అప్పుల బాధ నుంచి తప్పించుకోవాలని భావించారు. కానీ చివరకు సైబర్ నేరగాళ్లు వలలో పడి మరింతగా నష్టపోయారు. ఏకంగా రూ.40 లక్షలు పొగొట్టుకున్నారు. అసలే అప్పులు ఇచ్చిన వారి నుంచి తీవ్రమై ఒత్తిడి ఉండడం, వాటిని తీర్చే క్రమంలో మరో రూ.40లక్షలు నష్టపోవడంతో వారి పరిస్థితి దారుణంగా ఉంది. హైదరాబాద్‌లో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం: నగరంలోని ఖైరతాబాద్ ప్రాంతంలో నివసించే వెంకటేష్, లావణ్య దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. బుక్ షాప్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గత ఏడాది మార్చి వరకు వీరు చాలా సంతోషంగా ఉన్నారు. కానీ కరోనా రావడం లాక్ డౌన్ విధించడంతో రోడ్డున పడ్డారు. స్కూళ్లు, కాలేజీలు మూతపడడంతో గిరాకీ లేక ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఐతే అప్పటికే కోటి రూపాయలు చేసి ఇల్లు కట్టుకున్నారు. అప్పు ఇచ్చిన వారికి ఆ డబ్బును తిరిగి చెల్లించాల్సి ఉంది. కానీ వ్యాపారం మూతపడడంతో అప్పు తీర్చలేకపోయారు. డబ్బులు కట్టాల్సిందేనని రోజు రోజుకూ వారి నుంచి ఒత్తిడి పెరుగుతోంది. ఈ క్రమంలో దిక్కుతోచని స్థితిలో కిడ్నీలు అమ్మేయాలని ఆ దంపతులు నిర్ణయించుకున్నారు.

ఒక్కో కిడ్నీకి అమ్మగా వచ్చిన డబ్బులను అప్పులు ఇచ్చిన వారికి చెల్లించాలని అనుకున్నారు. కిడ్నీలు కొనేవారి కోసం గూగుల్‌లో వెతికారు. అలా కొందరి నెంబర్లు దొరకడంతో వారిని ఫోన్ ద్వారా సంప్రదించారు. అలా ఓ వ్యక్తితో డీల్ కుదుర్చుకున్నారు. ఢిల్లీలోని ‘హోప్‌ కిడ్నీ సెంటర్‌’లో మీ కిడ్నీ తీసుకునేలా ఏర్పాటు చేస్తాననని ఆ వ్యక్తి హామీ ఇఛ్చాడు. ఒక్కో కిడ్నీకి రూ.5 కోట్లు వచ్చేలా సాయం చేస్తానని నమ్మించాడు. ఇది నిజమేనని ఆ అమాయకపు జంట నమ్మేసింది. ఐతే ప్రాసెసింగ్ ఫీజు, వైద్యుల కమిషన్ కోసం ముందుగా రూ.4 లక్షలు చెల్లించాలని ఆ వ్యక్తి అడిగాడు. రెండు కిడ్నీలకు కలిపి రూ.10 కోట్లు వస్తుంటే రూ.4లక్షలు ఇవ్వడం ఓ లెక్కా అని వెంటనే ఇచ్చేశారు. ఆ తర్వాత మరోసారి డబ్బులు అడగడంతో అనుమానం వచ్చి డబ్బులు ఇవ్వలేదు. కొన్ని రోజుల తర్వాత గూగుల్ ద్వారా మరొకరి ఫోన్ నెంబర్ సంపాదించి అతడికి కాల్ చేశారు. అతడు కూడా రూ.9లక్షలు వసూలు చేశాడు. ఇలా మొత్తం నాలుగు సార్లు మోసపోయి రూ.40 లక్షలు నష్టపోయారు. చివరకు తాము మోసపోయామని గ్రహించి ఇటీవల సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.