ఓ వడ్డీ వ్యాపారి తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణానికి తెగబడ్డాడు. వడ్డీ డబ్బులు చెల్లించలేదనే కారణంతో మహిళను కిడ్నాప్ చేసిన ఘటన కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే జిల్లాలోని టేకులపల్లి మండలం సులానగర్‌కు చెందిన అజ్మీరా హట్యా అదే గ్రామానికి చెందిన బానోత్ హన్మా అనే వ్యక్తి స్థానిక వడ్డీ వ్యాపారి వద్ద రూ. 2 లక్షలు అప్పు తీసుకున్నాడు.

తీసుకున్న మొత్తంలో ఇటీవల రూ.లక్షన్నర చెల్లించాడు.
ఇంకొంత మొత్తం ఇవ్వాల్సి ఉండగా లాక్‌డౌన్ కారణంగా మిగతా అసలు, వడ్డీని హట్యా చెల్లించలేకపోయాడు. పరిస్థితి వివరించి త్వరలోనే చెల్లిస్తానని, కొంత గడువు కావాలని వడ్డీ వ్యాపారిని కోరాడు.

అందుకు అంగీకరించని వ్యాపారి డబ్బులు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టాడు. కాస్త సమయం ఇస్తే అసలు వడ్డీ ఇస్తానని చెప్పినా వినలేదు. బాధితుడిపై దాడికి చేయడంతో పాటు అతడి భార్యను తన ఇంటికి లాక్కెళ్లి నిర్బంధించాడు. దీంతో బాధితుడు నేరుగా టేకులపల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.