దిల్లీ: విడాకులు మంజూరయినప్పటికీ, మైనార్టీ తీరే వరకు కుమారుణ్ని పోషించే బాధ్యత తండ్రిదేనని బుధవారం సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. పోషణ ఖర్చుల కింద మేజర్‌ అయ్యే వరకు కుమారునికి ప్రతి నెలా రూ.50వేల వంతున ఇవ్వాలని జస్టిస్‌ ఎం.ఆర్‌.షా, జస్టిస్‌ ఎ.ఎస్‌.బోపన్నలతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. ఆర్మీలో మేజర్‌గా పనిచేస్తున్న ఓ అధికారి, ఆయన భార్యకు మధ్య వివాదంలో ఈ తీర్పునిచ్చింది. వారి గొడవలు ఎలా ఉన్నప్పటికీ, బాలుని చదువు, ఇతర ఖర్చులను తండ్రే భరించాలని కోర్టు ఆదేశించింది. పుట్టినింటిలో ఉన్న తల్లికి ఎలాంటి సంపాదన లేదని గుర్తు చేసింది. సొమ్ము పంపించే ఏర్పాట్లు చూడాలని ఆర్మీ అధికారులను ఆదేశించింది._

రాష్ట్రాల దయాదాక్షిణ్యాలపై హైకోర్టులను వదిలేయకండి:

న్యాయస్థానాల్లో మౌలిక వసతులకయ్యే నిధుల కోసం హైకోర్టులను రాష్ట్ర ప్రభుత్వాల దయాదాక్షిణ్యాలకు వదిలేయకూడదని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. న్యాయవ్యవస్థలో మౌలిక వసతుల కల్పన కోసం కేంద్రీకృత వ్యవస్థను ఏర్పాటు చేయాలని అభిప్రాయపడింది.