సమాజం ఎటు పోతోంది! అమ్మ కూడా ఇలా మారిపోతోంది ఏమిటి !! అక్రమ సంబంధాలే అనర్ధాలకు దారి తీస్తాయనుకుంటే కూతురి భర్తతోనే చాటు మాటు వ్యవహారాలు సాగించింది. అమ్మ వ్యవహారం మింగుడు పడని ఇద్దరు కూతుళ్లు ఆమెను మట్టుపెట్టారు. బిడ్డల్ని కంటికి రెప్పలా చూసుకుంటూ వారి బాగోగుల కోసం అమ్మ అహర్నిశలూ శ్రమిస్తుంది. భర్త తనను ఒంటరిని చేసినా వారి కోసమే బ్రతుకుతూ తన జీవితాన్ని త్యాగం చేస్తుంది. ఎందుకో ఈ అమ్మ మనసుకి చీడ పట్టింది. నల్లగొండ రూరల్ మండలం అప్పాజీపేటలో ఈ దారుణం చోటు చేసుకుంది.

అప్పాజీ పేటకు చెందిన కల్లూరి సత్యమ్మకు ఇద్దరు కూతుర్లు. భర్త మరణించడంతో ఇద్దరు కూతుళ్లను పెంచి పెద్ద చేసింది. పెద్ద కూతురికి పెళ్లి చేసి అత్తారింటికి పంపించిన తరువాత అదే గ్రామానికి చెందిన ఆస్తిపరుడైన యాదయ్య సత్యమ్యకు సహాయంగా ఉండేవాడు. ఈ క్రమంలో అతడితో అక్రమ సంబంధం కొనసాగించింది సత్యమ్మ. రెండో కూతురు రుద్రమ్మను కూడా అతడి దగ్గరకు పంపిస్తే బ్రతకడానికి ఏలోటూ ఉండదనుకుంది. కొన్ని రోజులకు రుద్రమ్మను యాదయ్యకు ఇచ్చి పెళ్లి చేసింది. ఏడాది తిరిగేసరికి వారికి ఓ పాప పుట్టింది. అయినా ఓ పక్క అల్లుడు యాదయ్యతో అక్రమ సంబంధం కొనసాగిస్తూనే ఉంది అత్త సత్యమ్మ. ఇదే విషయపై తల్లీ కూతుళ్లు గొడవపడేవారు.

రుద్రమ్మ భర్తని, తల్లిని వదిలి బిడ్డతో కలిసి చౌటుప్పల్‌లో ఒంటరిగా వుంటోంది. దీంతో అత్తా అల్లుళ్లకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. తల్లి ప్రవర్తన తెలుసుకున్న పెద్ద కూతురు కూడా ఆమెతో మూడేళ్లుగా మాట్లాడడం మానేసింది. తల్లిని చంపాలనే నిర్ణయానికి వచ్చారు ఇద్దరు అక్కచెల్లెళ్లు. జంగయ్య అనే వ్యక్తికి రూ.20వేలు సుపారీ ఇచ్చి అమ్మని చంపించారు. ఇరుగుపొరుగు వారు ఈ విషయం స్థానిక ప్రజాపతినిధికి తెలియజేశారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆండాళ్లు, రుద్రమ్మలను విచారించి అరెస్ట్ చేశారు.