కుటుంబ కలహాల నేపథ్యంలో అపార్ట్‌మెంట్‌పై నుంచి దూకి ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఖమ్మం జిల్లా గ్రానైట్ ఫ్యాక్టరీ అసోసియేషన్ అధ్యక్షులు, గ్రానైట్ వ్యాపారి వేముల రవికుమార్,వాణి (45) దంపతులు నగరంలోని బైపాస్ రోడ్‌లోని శ్రీమంతా రెసిడెన్సీలో నివసిస్తున్నారు. వీరికి ఒక కూతురు, కుమారుడు ఉన్నాడు. కూతురు నవీన ఎంబీబీఎస్ (MBBS) పూర్తి చేసింది. ఆమె ఒక యువకుడితో ప్రేమ వ్యవహారం కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఈ విషయం పై పలుమార్లు పంచాయితీ పెట్టినప్పటికి కూడా సమస్య పరిష్కారం కాకపోవడంతో వాణి గత కొన్ని నెలల నుంచి మానసిక క్షోభకు గురైంది. ఈ రోజు తన కూతురు నవీన ప్రియుడితో వెళ్లిపోయిందని తెలియడంతో ఈ విషయాన్ని జీర్ణించుకోలేక క్షణికావేశంలో అపార్ట్‌మెంట్ పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది.