తల్లిఒడిలో నిద్రిస్తున్న రెండునెలల పాపను అపహరించిన ముగ్గురు కిడ్నాపర్లను పాతబస్తీ పోలీసులు గంటల వ్యవధిలో పట్టుకున్నారు. ఆ పసికందుకు ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేయించి తల్లికి అప్పగించారు. పాపను కాపాడిన దేవుళ్లంటూ సిపి అంజనీకుమార్‌కు చిన్నారి తల్లి కృతజ్ఞతలు తెలిపారు. ఫరూక్‌నగర్‌లో ఉంటున్న షేక్‌ బషీర్‌, సుల్తానా దంపతులు కూలిపని చేసుకుంటున్నాడు. రెండేళ్ల కుమారుడు అబ్దుల్లా, రెండునెలల పాప మరియాతో కలిసి రాత్రివేళల్లో ఫరూక్‌నగర్‌ పరిసర ప్రాంత పాదబాటలపై నిద్రిస్తుంటారు. బుధవారం అర్ధరాత్రి దాటాక 2.20గంటల ప్రాంతంలో ఒక ఆటోలో వచ్చిన నిందితులు సయ్యద్‌ సాహిల్‌, జబీన్‌, ఫాతిమాలు అక్కడే సుల్తానా పక్కనే పడుకున్న 2నెలల పాపను నిశ్శబ్దంగా తీసుకుని ఉడాయించారు. తెల్లవారుజామున పాప కనిపించకపోవడంతో బషీర్‌ ఫలక్‌నుమా పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

డీసీపీ గజరావ్‌ భూపాల్‌ ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. ప్రధాన రహదారి, సలామీ ఆసుపత్రి, నైస్‌ ఆసుపత్రి, వట్టేపల్లి ప్రాంతాల్లో సీసీ కెమెరాలను పరిశీలించారు. వట్టేపల్లిలో సాహిల్‌ ఇంటి సమీపంలో ఆటో కనిపించింది. పోలీసులు తనిఖీలు నిర్వహించగా పాప కనిపించింది. పసికందును అపహరించింది ఎవరికైనా విక్రయించేందుకా.? పెంచుకునేందుకా.? అని పోలీసులు విచారిస్తున్నారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ‘‘బాధితులెవరైనా మా తరఫున భరోసా ఇస్తాం. వారు పేదలా? ధనికులా? అన్న తేడాల్లేవు. బషీర్‌ ఠాణాలో ఫిర్యాదు చేసేందుకు రాగానే అతడి ఆవేదన, ఆందోళన అర్థం చేసుకుని వెంటనే స్పందించాం’’ అరి తెలిపారు. బషీర్‌కే కాదు, పోలీస్‌ఠాణాకు వస్తున్నవారందరితోనూ ఇలాగే వ్యవహరిస్తామని వివరించారు.