కూలీ అడ్డా నుంచి వెళ్లిన ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. తలపై బండరాయితో మోది దారుణానికి పాల్పడ్డారు. ఈ సంఘటన మేడ్చల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకున్నది. అయితే, కూలీ పని ఉందని తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడి ఆపై చంపేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసుల వివరాల ప్రకారం: మెదక్‌ జిల్లా, వెల్దుర్తి మండలం, రామంతాపూర్‌ తండాకు చెందిన విజయ (22)కు 8 ఏండ్ల క్రితం వివాహం కాగా. ఇటీవల భర్తతో దూరంగా ఉంటుంది. ప్రతి రోజూ రైలులో వచ్చి మేడ్చల్‌ పట్టణంలో అడ్డా కూలీగా పనిచేస్తుంది.

ఇందులో భాగంగా ఈ నెల 17న ఉదయం రైలులో మేడ్చల్‌కు వచ్చి కూలీ అడ్డా వద్ద ఉంది. అదే సమయంలో గుర్తు తెలియని వ్యక్తి వచ్చి పని ఉందని ఆమెను తీసుకెళ్లాడు. అయితే.. రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు 18న మేడ్చల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. కాగా… సోమవారం ఉదయం మేడ్చల్‌ పట్టణంలోని రైల్వే గేటు సమీపంలో ఓ మహిళ మృతి చెంది ఉందని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి.. అదృశ్యమైన విజయదిగా గుర్తించారు. తలపై రాయితోమోది హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆమెను కూలీ అడ్డా నుంచి తీసుకువెళ్లి లైంగికదాడికి పాల్పడి. ఆపై హత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఆమెను తీసుకెళ్లిన గుర్తు తెలియని వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు