టీడీపీలో మంత్రిగా ప‌నిచేసిన తుమ్మల నాగేశ్వరరావు తెలంగాణ వచ్చాక కేసీఆర్ ఆహ్వానంతో టీఆర్ఎస్‌లో చేరి తన హవా కొనసాగిస్తూ వ‌స్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా ఓట‌మి చ‌విచూసిన తుమ్మ‌ల పొలిటికల్ కెరీర్‌కు బారీగానే దెబ్బ ప‌డింది. త‌న‌కు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి మండ‌లిలోకి తీసుకుంటార‌ని భావిస్తూ వ‌చ్చిన తుమ్మ‌ల‌కు గ‌త‌ ఎన్నిక‌ల‌లో ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్‌ను ఒంటి చేత్తో గెలిపించి తీసుకువ‌స్తాన‌ని చెప్పినా ఫలితాలు రివ‌ర్స్ అయ్యింది.

దీంతో కేసీఆర్‌ దగ్గర తుమ్మల ఇమేజ్ పడిపోవటానికి తోడుగా జూనియర్ అయిన పువ్వాడ అజయ్‌ను కేసీఆర్ కేబినెట్‌లోకి తీసుకోవడం కూడా తుమ్మలకు మింగుడుపడటం లేదట‌. కార‌ణాలు ఏవైనా కొంతకాలంగా పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారన్న‌ది వాత్స‌వం. కాగా మ‌రోవైపు పాలేరులో తుమ్మలపై గెలిచిన కాంగ్రెస్ అభ్య‌ర్థి గెలిచి మూణ్నెళ్లు కూడా తిరక్కుండానే ఆపార్టీకి గుడ్‌బై చెప్పేసి తెరాస తీర్థం పుచ్చుకోవ‌టంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలలో తెరాస గెలుపును రుచి చూపించి త‌న మార్క వేసుకున్నారు.

దీంతో సంస్థాగత పదవుల ఎంపికలోనూ తన విధేయ అనుచరగణానికి మాత్రమే పదవులు ఇస్తూ వెళ్తుండ‌టం తుమ్మ‌ల‌కు మ‌రింత ఇబ్బందిగా మారింది. కాగా ప్రాధాన్య‌త లేని పార్టీలో ఉండే క‌న్నా బైట‌కు వ‌చ్చి వేరుకుంప‌టి పెట్టుకోవ‌టం న‌య‌మ‌ని స‌న్నిహితులు చెపుతుండ‌టంతో ఆదిశ‌గా ప్ర‌య‌త్నాలు ఆరంభించిన‌ట్టు స‌మాచారం. ఇప్ప‌టికే క‌మ‌ల‌నాధుల‌తో ట‌చ్ లో ఉన్న‌ట్టు మ‌రో క‌థ‌నం వినిపిస్తోంది. దీంతో తుమ్మల వ్యూహమేంటో అర్థంకాని క్యాడర్‌ ఒకింత గందరగోళానికి గురవుతోంది….