వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తమిళనాడులోని 39 లోక్‭సభ స్థానాలతో పాటు పుదుచ్చేరి లోక్‭సభ స్థానాన్ని కూడా గెలుచుకొని దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని పార్టీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి స్టాలిన్ అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే ఘన విజయం సాధించి జాతీయ స్థాయిలో రాజకీయ శక్తిగా మారనుందని ఆ పార్టీ అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ అన్నారు. ఆదివారం ఉదయం జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆయన రెండోసారి పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అదే సమయంలో స్టాలిన్‌ సోదరి, ఎంపీ కనిమొళిని డీఎంకే డిప్యూటీ కార్యదర్శిగా నియమించారు. ఈ సందర్భంగా స్టాలిన్‌ ప్రసగింస్తూ వచ్చే లోక్‌సభ ఎన్నికల సమయంలో గెలుపు కోసం అక్రమాలకు పాల్పడేందుకు బీజేపీ ఏ మాత్రం వెనుకాడబోదని, ఈ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని కార్యకర్తలకు సూచించారు.

తమిళ ప్రజలు రాజకీయాలను, ఆధ్యాత్మికతను వేర్వేరుగా భావిస్తుండటం వల్లే బీజేపీ మత రాజకీయాలను అమలు చేయలేకపోతున్నదని అన్నారు. అన్నాడీఎంకేని అడ్డు పెట్టుకుని ఎలాగైనా గెలిచేందుకు బీజేపీ ప్రయత్నించనుందని స్టాలిన్‌ అన్నారు. వచ్చేఎన్నికల్లో పుదుచ్చేరి సహా 40 నియోజకవర్గాలలో విజయం సాధించి జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నితీశ్‭లా కూటమి ప్రయత్నాలు కాకపోయినప్పటికీ, కేసీఆర్‭లా జాతీయ పార్టీ ఆలోచన లేనప్పటికీ సందర్భం వస్తే మాత్రం జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని స్టాలిన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది