ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టులోని బొజ్జపోతన్న ఆలయం సమీపంలోని చెట్ల పొదల్లో గుర్తు తెలియని యువతి మృతదేహం ఆదివారం లభ్యమైంది. అటుగా వెళ్లిన భక్తులకు చెట్ల పొదల్లో యువతి శవం కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. దాంతో మల్యాల సిఐ నాగేందర్‌గౌడ్, కొడిమ్యాల ఎస్‌ఐ సతీశ్, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని శవాన్ని పరిశీలించారు. సుమారు 24 ఏళ్ల వయస్సు ఉన్న యువతిని గుర్తు తెలియని వ్యక్తులు మెడకు ఉరివేసి చంపినట్లు ఆనవాళ్లు ఉన్నాయి.

మృతురాలు ఎర్ర చుక్కలు ఉన్నతెల్లరంగు కుర్తా, ఎర్ర రంగు పైజామా ధరించి ఉంది. గుర్తు తెలియని శవంగా కేసు నమోదు చేసుకుని, మృతురాలి ఆచూకీ కోసం అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నామని సిఐ నాగేందర్‌గౌడ్ వివరించారు. కాగా యువతి హత్యతో కొండగట్టు సమీపంలోని గ్రామాల్లో కలకలం రేగింది. గతంలో కూడా పలు సంఘటనలు చోటు చేసుకోవడం. ఇలాంటి సంఘటనలు అరికట్టేందుకు పోలీసులు చర్యలు చేపట్టినా యువతి హత్యకు గురికావడం ఆందోళనకు గురి చేస్తోంది. నమ్మించి తన వెంట తీసుకువచ్చిన ప్రియుడే హతమార్చాడా, లేక ఆ జంటను ఎవరైనా చూసి వారిపై అఘాయిత్యం చేశారా అనేది తేలాల్సి ఉంది.