రాష్ట్ర పార్టీలో మహిళా నాయకత్వానికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. త్వరలో జరగనున్న టీపీసీసీ సంస్థాగత మార్పుల్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా మహిళా నాయకురాలికి అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం. దీని కోసం వెనుకబడిన వర్గాలకు చెందిన మాజీ మంత్రి కొండా సురేఖ పేరును అధిష్టానం తీవ్రంగా పరిశీలిస్తున్నట్టు తెలిసింది. రాష్ట్రంలో ఉన్న రెండు ప్రధాన బీసీ సామాజిక వర్గాల్లో మంచి సంబంధాలు, మంత్రిగా పనిచేసిన అనుభవం, వాక్పటిమ లాంటివి సురేఖకు అనుకూలంగా ఉన్నాయని తెలుస్తోంది. పార్టీలో కీలక పదవులు చేపట్టి వెళ్లిపోయిన డీకే అరుణ, విజయశాంతిలకు దీటుగా మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహించాలనే ఆలోచనలో ఢిల్లీ పెద్దలు ఉన్నట్లు సమాచారం.
ప్రస్తుత ఎమ్మెల్యే, ఆదివాసీ నాయకురాలు సీతక్కకు రాష్ట్ర మహిళా కాంగ్రెస్ పగ్గాలు అప్పగించడంతో పాటు కీలక కమిటీల్లో ఆమె పేరు చేరుస్తారనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది. గిరిజన సామాజిక వర్గానికి చెందిన సీతక్క రెండోసారి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పటికే మహిళా కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్నారు.