ఊహించని సంఘటన ఇది. ఆకలితో నకనకలాడుతున్న ఓ వానరం ఆ దారిలో వెళ్తున్న వ్యక్తి చేతిలో సంచి గమనించింది. అందులో ఏదైనా ఆహార పదార్థం ఉండి ఉంటుందని ఊహించిన వానరం అవకాశం కోసం చూస్తోంది. ఇంతలో ఆ వ్యక్తి చేతికి పని పడడంతో బ్యాగు పక్కన ఉంచి ఆ పని చూస్తుండడంతో కోతి ఆ సంచిపట్టుకుని వుడాయించింది. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం బదాయూలో జరిగిన ఈ ఆసక్తికర సంఘటన వివరాల్లోకి వెళితే:

ఓ వ్యక్తి బ్యాంకులో జమ చేయాల్సిన 57 వేల రూపాయను బ్యాగులో పెట్టి తీసుకు వెళ్తున్నాడు. ఇతని చేతిలో బ్యాగు గమనించిన వానరం అతను బ్యాగు పక్కనపట్టి మరో పనిలో ఉండగా దాన్ని ఎత్తుకెళ్లింది. బ్యాగుతో సహా సమీపంలోని చెట్టు ఎక్కి కూర్చుంది. అనంతరం బ్యాగు తెరిచి అందులో ఏమైనా తినుబండారాలు ఉన్నాయేమోనని వెతికింది.

ఏమీ కనిపించక పోవడంతో అందులో ఉన్న నోట్లను బయటకు తీసి విసిరేసింది. ఈ సంఘటనతో ఆశ్చర్యపోయిన బ్యాగు యజమాని గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు గుమిగూడారు. కోతి విసిరేసిన నోట్లను పట్టుకునేందుకు ఎగబడ్డారు. చాలా మంది తమకు దొరికిన నోట్లను ఆ వ్యక్తికే తిరిగి అప్పగించగా, కొందరు మాత్రం చేతివాటం ప్రదర్శించారు. దీంతో అనుకున్న మొత్తం కంటే కొంత తగ్గింది.