రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బిలాస్‌పూర్ జిల్లాలో కొడుకు చనిపోయి విధవరాలిగా మారిన కోడలిని మామ పెండ్లి చేసుకున్నాడు. కృష్ణా రాజ్‌పుత్ సింగ్‌కు గౌతమ్ రాజ్‌పుత్ అనే కుమారుడు ఉన్నాడు. కొన్నేండ్ల క్రితం ఆర్తిసింగ్ అనే యువతితో అతనికి వివాహం జరిపించాడు. అయితే, రెండేండ్ల క్రితం దురుదృష్టవశాత్తు గౌతమ్‌సింగ్ మరణించాడు. అయితే, భర్త మరణించినా భార్య ఆర్తి సింగ్ మాత్రం అత్తగారింట్లోనే ఉన్నది. కాగా, కృష్ణా రాజ్‌పుత్ సింగ్ కుటుంబం రాజ్‌పుత్ వంశానికి చెందినది. రాజ్‌పుత్‌ వంశంలో స్త్రీలు పెద్దగా బయటకు రారు. దీంతో భర్త మరణించినప్పటి నుంచి రెండేండ్లపాటు ఆర్తిసింగ్ ఇంట్లోనే ఉండిపోయింది.

అయితే, క్షత్రియ ఆచారం ప్రకారం మహిళలకు పునర్ వివాహం చేయవచ్చు. ఇదే విషయాన్ని ఆర్తి సింగ్ మామ కృష్ణా రాజపుత్ సింగ్ క్షత్రియ మహాసభ ముందుకు తీసుకొచ్చారు. దీంతో క్షత్రియ మహాసభ సభ్యులు కృష్ణాసింగ్ ప్రతిపాదనపై ఆయన కోడలు ఆర్తిసింగ్ అభిప్రాయం అడిగారు. రెండేండ్లుగా మామ తనను చూసుకుంటున్న తీరు నచ్చిన ఆర్తిసింగ్ కూడా మామను పెండ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. దీంతో క్షత్రియ సంప్రదాయం ప్రకారం కొద్దిమంది సమక్షంలో వారి వివాహం జరిగింది. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.