తన కొడుకు ఓ యువతిపై అత్యాచారానికి ఒడిగడుతుంటే అడ్డుకోవాల్సిన తల్లి అతడిని ప్రోత్సహించింది. ఏకంగా వీడియో కూడా తీసింది. ఈ దారుణం ఛత్తీస్‌గఢ్‌లో జరిగింది. ఓ యువకుడు, ఓ యువతితో స్నేహం చేసినట్టు నటించాడు. ఆమెను ఓ రోజు ఇంటికి పిలిచాడు. బాయ్ ఫ్రెండ్‌ను నమ్మి ఇంటికి వచ్చిన యువతికి అతడి తల్లి స్నాక్స్ చేసి పెట్టింది. అయితే, అందులో మత్తుపదార్థం కలిపింది. దీంతో ఆహారం తిన్న తర్వాత ఆ యువతి స్పృహకోల్పోయింది.

ఆ తర్వాత ఆమెను తల్లీకొడుకు కలసి బెడ్రూమ్‌లోకి తీసుకెళ్లారు. అక్కడ యువతి మీద అత్యాచారం చేస్తుంటే, దాన్ని ఆ తల్లి వీడియో తీసింది. ఈ విషయం బయటకు రాకుండా ఉండాలంటే డబ్బులు ఇవ్వాలని బెదిరించారు. దీంతో బాధితురాలు వారికి రూ.4లక్షలు చెల్లించింది. మరోవైపు ఈ విషయం తెలిసిన యువకుడి సోదరి, ఆమె భర్త కూడా బాధితురాలి నుంచి డబ్బు డిమాండ్ చేశారు. కానీ, తన వద్ద డబ్బులు లేవని యువతి చెప్పింది. ఆ యువతి తండ్రి పొలం విక్రయించగా రూ.6లక్షలు వచ్చాయి.

ఆ డబ్బులు జాగ్రత్తగా పెట్టాలంటూ కూతురికి ఇచ్చాడు. తండ్రి ఇచ్చిన డబ్బులను ఆ తల్లీకొడుకులు బ్లాక్ మెయిల్ చేయడంతో రూ.4లక్షలు వారికి ఇచ్చేసింది. అదే సమయంలో ఆ డబ్బులు కావాలని తండ్రి అడగడంతో మిగిలిన రూ.2లక్షలు ఇచ్చింది. రూ.4లక్షలు ఏమయ్యాయని తండ్రి ప్రశ్నించడంతో బాధితురాలు బోరున ఏడ్చింది. ఆ తర్వాత అసలు విషయం చెప్పింది. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తల్లీకొడుకులను అరెస్ట్ చేశారు…