{"uid":"EA9684FB-092A-4DFE-B413-F44AFB16F789_1617637411160","source":"other","origin":"gallery"}

పుణెలో ఓ మహిళ తన భర్త, అత్త శారీరకంగా, మానసికంగా తనను వేధిస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, ఈ కేసులో పోలీసులకు కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. ఆ మహిళ ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం: జనవరి 5, 2021న ఆమెకు వివాహమైంది. పెళ్లయిన తర్వాత ఈ కొత్త జంట హనీమూన్ నిమిత్తం గోవాకు వెళ్లింది. అక్కడ మూడు రోజులు గడిపారు. అయితే ఇద్దరి మధ్య ఎలాంటి శారీరక సంబంధం లేకపోవడం గమనార్హం. భార్య దగ్గరవడానికి ప్రయత్నించే ప్రతీసారి ఏదో ఒక విధంగా ఆ భర్త దూరం పెట్టాడు. తన భర్త కాస్త భయస్తుడేమోనని ఆమె భావించింది. కొన్నిరోజులకు ఈ జంట కొత్త ఫ్లాట్‌కు షిఫ్టయింది. ఆ ఫ్లాట్‌లో ఇద్దరూ కలిసి ఉంటున్న సమయంలో భర్త గురించి ఆమెకు అసలు విషయం తెలిసింది. కొత్తగా పెళ్లయినప్పటికీ ఆమె భర్త వేరే గదిలోకి వెళ్లి నిద్రపోయేవాడు. దీంతో అసలు అతని సమస్య ఏంటో తెలుసుకునేందుకు ఆమె పలుమార్లు మాట్లాడింది. చివరికి ఒకరోజు తన లోపం గురించి ఆ భర్త భార్యకు చెప్పుకున్నాడు. తనకు నపుంసకత్వం సమస్య ఉందని, కాపురానికి పనికిరానని ఆ భర్త చెప్పడంతో విస్తుపోవడం ఆ భార్య వంతయింది. భర్తను అర్థం చేసుకున్న ఆ భార్య డాక్టర్‌ను కలిసి సలహా తీసుకుందామని భర్తకు చెప్పింది. ఇదిలా ఉండగా పెళ్లి సమయంలో స్నేహితుడి వద్ద ఈ మహిళ భర్త రూ.3 లక్షలు అప్పు చేశాడు. ఆ అప్పు తీర్చాలని అతని స్నేహితుడు ఒత్తిడి చేశాడు. ఆ అప్పు తీర్చేందుకు పుట్టింటి నుంచి డబ్బు తీసుకురావాలని భార్యను సదరు భర్త అడిగాడు. అందుకు ఆమె అంగీకరించలేదు,

పెళ్లి సమయంలో కట్నకానుకలు చాలానే ఇచ్చారని, ఇప్పుడు మళ్లీ డబ్బులు కావాలంటే తన కుటుంబం ఇచ్చుకోలేదని ఆ మహిళ భర్తకు చెప్పింది. దీంతో అప్పటి నుంచి సదరు మహిళకు భర్త, అత్త నుంచి వేధింపులు మొదలయ్యాయి. ఆమెను శారీరకంగా హింసిస్తూ, మానసికంగా సూటిపోటిమాటలతో వేధించసాగారు. తన నపుంసకత్వం గురించి ఎవరికీ చెప్పొద్దని, బయటపెడితే చంపేస్తామని మహిళ భర్త, అత్త బెదిరించారు. వేధింపులు భరింలేకపోయిన సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. హింజావాడి పోలీస్ స్టేషన్‌లో సెక్షన్ 498(ఏ), 506, 420, 34 కింద నిందితులపై కేసు నమోదైంది. హింజావాడిలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఇంజనీర్‌గా పనిచేస్తున్న తన భర్త ఓ మ్యాట్రిమోనియల్ బ్యూరో ద్వారా తనను సంప్రదించాడని, పెళ్లికి ముందు పలుమార్లు మాట్లాడుకున్నప్పటికీ ఒక్కసారి కూడా తనకు నపుంసకత్వం ఉందని చెప్పలేదని, పెళ్లయిన కొన్నిరోజులకు ఈ విషయం తనకు తెలిసిందని సదరు మహిళ ఫిర్యాదులో పేర్కొంది. అసలు విషయం దాచి తన భర్త, అత్త మోసం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లయిన తర్వాత కూడా తనను హింసించారని ఫిర్యాదులో తెలిపింది. పోలీసులు నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.