ఆంధ్రప్రదేశ్‌లో కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల భాజపా అధినాయకత్వం నుంచి పిలుపుతో దిల్లీకి వెళ్లిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. భాజపాతో కలిసి పనిచేయనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం విజయవాడలో జనసేన, భాజపాకు చెందిన కీలక నేతలు సమావేశమయ్యారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఏ రకంగా కలిసి ముందుకెళ్లాలనే అంశంపై ఇరు పార్టీల నేతలు నిర్ణయించనున్నారు..

అంతకముందు విడివిడిగా భేటీ అయిన ఇరు పార్టీల నేతలు ఉమ్మడి భేటీలో ఎలాంటి అంశాలను లేవనెత్తాలనే అంశంపై చర్చించారు. వాటి ప్రాతిపదికన హోటల్‌ మురళీ ఫార్చ్యూన్‌లో ఉమ్మడి భేటీ ప్రారంభమైంది. జనసేన తరఫున ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌, రాజకీయ వ్యవహారాల ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌, మరికొందరు నేతలు ఉండగా భాజపా తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, భాజపా రాష్ట్రవ్యవహారాల ఇన్‌ఛార్జి సునీల్‌ దియోధర్‌, పురందేశ్వరి, జీవీఎల్‌, సోము వీర్రాజు ఉన్నారు.

అమరావతి రాజధాని అంశంపైనే కాకుండా స్థానిక సంస్థల ఎన్నికలు, రాష్ట్రంలోని ప్రజా సమస్యలపై ఎలా ముందుకెళ్లాలి? 2024 ఎన్నికల వరకు ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్లాలనే అంశాలపై సమగ్రంగా చర్చించనున్నట్టు ఇరు పార్టీల నేతలు తెలిపారు. మధ్యాహ్నం 3గంటలకు మీడియా ముందుకు ఇరు పార్టీల నేతలు వచ్చే అవకాశం ఉంది.