భార్యకు తెలియకుండా మరొక మహిళతో సహజీవనం.. భద్రాచలం జిల్లా నుండి వచ్చి మూడేండ్లుగా కుత్బుల్లాపూర్ డివిజన్ చింతల్ ప్రాంతంలోని పద్మానగర్‌లో నివాసం ఉంటున్న సుధాకర్‌కు 2015లో కృష్ణా జిల్లా రావుపాలెం గ్రామానికి చెందిన లావణ్యతో పెండ్లి అయింది. పెండ్లి సమయంలో కట్నంగా నాలుగు లక్షల రూపాయల నగదు అతడికి అందజేశారు. అయితే సంవత్సరం వరకు లావణ్యతో జీవితం సాఫీగా సాగింది. బాబు పుట్టిన తరువాత భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో అప్పటి నుంచి లావణ్యకు దూరంగా ఉంటున్నాడు. దీంతో భర్తపై భార్యకు అనుమానం మొదలైంది. మూడేండ్లుగా ఎక్కడుంటున్నాడో ఎవరికి చెప్పకుండా అప్పుడప్పుడు కృష్ణా జిల్లాలో ఉన్న భార్య వద్దకు వెళ్లొస్తున్నాడు. కాని తనను హైదారాబాద్‌కు తీసుకెళ్లమని అడిగినప్పుడల్లా భర్త నిరాకరిస్తూ వస్తున్నాడు. ఆరు నెలలుగా భార్య లావణ్య వద్దకు వెళ్లకపోవడంతో అతడిపై అత్తింటి వారికి అనుమానం మొదలైంది.

ఈ క్రమంలో పద్మానగర్‌లో సుధాకర్ వేరే మహిళతో మూడేండ్లుగా సహజీవనం చేస్తున్నాడని తెలుసుకున్న లావణ్య తన బంధువులతో కలిసి భర్తపై దాడి చేసింది. ప్రత్యక్షంగా మరో మహిళతో పట్టుబడటంతో సుధాకర్ తన భార్యేనని, గతంలో లావణ్య కంటే ముందే ఆ మహిళతో పెండ్లయ్యిందని ఓ కూతురు కూడా ఉందని చెప్పాడు. అనంతరం జీడిమెట్ల పోలీసులకు సుధాకర్‌ను అప్పగించారు. లావణ్య ఫిర్యాదు మేరకు భర్త సుధాకర్‌పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని సీఐ రమణారెడ్డి తెలిపారు…