ఓ విచిత్రమైన సంఘటన ఉత్తరప్రదేశ్ బదాయూలో జరిగింది. తన మాజీ భార్యే ఇప్పుడు తన సవతి తల్లి అని యువకుడు కనుగొన్నాడు. ఇంకా విచిత్రం ఏమిటంటే తండ్రికి, ఆమెకు ఒక బిడ్డ కూడా పుట్టాడు. ఇల్లు వదిలి వేరే చోట నివసిస్తున్న తన తండ్రి గురించి సమాచారం సేకరించడానికి కొడుకు జిల్లా పంచాయతీ రాజ్ కార్యాలయంలో ఆర్టీఐ దాఖలు చేయడంతో ఈ విషయం వెల్లడైంది. కొడుకు 2016 లో ఒక అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఆ సమయంలో వాళ్లిద్దరూ మైనర్లు. ఆరు నెలల తరువాత ఇద్దరూ విడిపోయారు. అతడు ఎంత బతిమాలినా ఆమె ససేమిరా అంది. తాగుడికి బానిసైన అతడితో కలిసి కాపురం చేయడం ఇష్టం లేదని వెళ్లిపోయింది.

అదే సమయంలో తండ్రి కూడా ఇల్లు వదిలి వెళ్లి పోయాడు. తండ్రి తన భార్యను వివాహం చేసుకున్నాడని తెలుసుకుని, అతడు బిసౌలి పోలీస్ స్టేషన్లో తండ్రిపై ఫిర్యాదు చేశాడు. ఇప్పుడు తన మాజీ భర్తకు ‘తల్లి’ అయిన ఆ అమ్మాయి, అతని వద్దకు తిరిగి రావడానికి నిరాకరించింది. తాను తన రెండవ భర్తతో చాలా సంతోషంగా ఉందని చెప్పింది. తండ్రి పారిశుధ్య కార్మికుడిగి విధులు నిర్వర్తిస్తున్నాడు. కొడుకు ఏవో చిన్నా చితక పనులు చేస్తూ సంపాదించిన కొద్ది మొత్తాన్ని తాగుడుకే ఖర్చు పెడుతుంటాడు. దీంతో ఆమె ఆ నిర్ణయం తీసుకుని ఉంటుందని గ్రామస్తులు భావిస్తున్నారు.