సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ సొంతింటికి మారిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు శ్రీనగర్ కాలనీలో ఉంటున్న విజయ్ దేవరకొండ ఫ్యామిలీ తాజాగా ఫిల్మ్ నగర్‌లోని కొత్త ఇంటికి మారింది. ఫిల్మ్ నగర్‌లోని హీరో శ్రీకాంత్‌ ఇంటికి సమీపంలో ఈ ఇంటికి విజయ్ దేవరకొండ కొనుగోలు చేశారు. ఆదివారం తల్లిదండ్రులు, సోదరుడితో కలిసి గృహప్రవేశం చేశారు విజయ్. అయితే, ప్రస్తుతం ఈ ఇంటి గురించి ఇండస్ట్రీలో చర్చ మొదలైంది. ఈ కొత్త సొంతింటి కోసం విజయ్ దేవరకొండ రూ.20 కోట్లు వెచ్చించినట్టు ఇండస్ట్రీ టాక్. ఈ ఇంటిని చాలా విశాలంగా నిర్మించుకున్నారట విజయ్. ప్రస్తుతం విజయ్ మంచి ఫామ్‌లో ఉన్నారు. ‘గీతగోవిందం’ సినిమాతో విజయ్ మార్కెట్ భారీగా పెరిగిపోయింది. దీంతో ప్రస్తుతం ఆయన రూ.8 నుంచి రూ.10 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నారని టాక్.

అంతేకాకుండా సొంతంగా రౌడీ బ్రాండ్‌ పేరుతో బట్టల వ్యాపారం కూడా చేస్తున్నారు. ఇది కూడా బాగా కలిసొస్తోందట. వీటన్నిటికీ తోడు వాణిజ్య ప్రకటనల ద్వారా వచ్చేది కూడా పెద్దమొత్తంలోనే ఉంటుందని అంటున్నారు. పలు బ్రాండ్లకు విజయ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. వీటి ద్వారా కూడా కోట్లలో ఆదాయం వస్తోంది.

అంతే కాకుండా, విజయ్ దేవరకొండ సినిమా ప్రొడక్షన్‌లోకి కూడా దిగారు. తొలి చిత్రంగా ‘మీకు మాత్రమే చెప్తాను’ నిర్మించారు. ఈ చిత్రం కూడా బాగానే లాభాలను తెచ్చిపెట్టింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండకు ఒక మంచి అమ్మాయిని వెతికే పనిలో కుటుంబ సభ్యులు బిజీగా ఉన్నారట. విజయ్‌ను ఓ ఇంటివాడిని చేసేముందు అతనితో ఒక సొంతింటిని కొనిపించేశారు తల్లిదండ్రులు. ‘ఇల్లు కట్టేశావ్ ఇక పెళ్లిచేసుకో’ అంటున్నారట తమ కుటుంబంలోని పెద్దలు. కాగా, కొత్తింటిలో తల్లిదండ్రులతో పాటు తమ్ముడు ఆనంద్ దేవరకొండతో కలిసి విజయ్ ఉంటున్నారు. అలాగే, గతంలో విజయ్ తండ్రి ఇందిరా నగర్ పరిసరాల్లో ఒక ఆఫీస్‌ని మెయింటెయిన్ చేసేవారు. ఇప్పుడు ఆ అడ్రస్ కూడా మారనుందట…