ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మహారాజ్ ‌గంజ్ జిల్లాలో దారుణం జరిగింది. ప్రేమ పేరుతో ఓ యువకుడు యువతిని మోసం చేశాడు. ఆమెతో ఏకాంతంగా గడిపిన దృశ్యాలను సెల్ ఫోన్ లో వీడియోలు, ఫోటోలు తీశాడు. ఆ తర్వాత కోరిక తీర్చాలని బ్లాక్ మెయిల్ చేశాడు. లేదంటే నగ్న వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించాడు. ఆ తర్వాత అన్నంత పనీ చేశాడు. అయినా బెదరని ప్రియురాలు మీడియాను ఆశ్రయించి ఆ నీచుడికి బుద్ధి చెప్పింది.

యువతికి తెలియకుండా వీడియోలు తీసిన యువకుడు:

మహారాజ్ గంజ్ జిల్లాలో నివాసం ఉండే యువతీ, యువకులు ప్రేమించుకున్నారు. ఆ తర్వాత శారీరకంగా కూడా దగ్గరయ్యారు. యువతికి తెలియకుండా ఆ యువకుడు ఏకాంతంగా కలిసిన సమయంలో వీడియోలు తీశాడు. ఆ తర్వాత ఏం జరిగిందో కానీ ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో విడిపోయారు. దూరంగా ఉంటున్నారు. మళ్లీ కొద్దీ రోజులుగా ఆ యువకుడు ప్రియురాలి వెంట పడటం మొదలు పెట్టాడు. తన లైంగిక కోరికలు తీర్చాలని వేధించడం స్టార్ట్ చేశాడు. లేకపోతే వీడియోలను బయటపెడతానని బెదిరించాడు.

యువతి వీడియోలను సోషల్ మీడియాలో పెట్టిన యువకుడు:

అతడు ఎంత బెదిరించినా ఆ యువతి లొంగలేదు. దీంతో ఆ కామాంధుడు మరింతగా రెచ్చిపోయి, ఆ యువతి పరువు తీయాలన్నా కోపంతో ఏకాంతంగా ఇద్దరూ కలిసిన వీడియోలు, ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది. అయితే పోలీసులు స్పందించ లేదు. యువతి మీడియాను ఆశ్రయించింది. దీనిపై మీడియాలో కథనాలు రావడంతో పోలీసులు అప్పుడు స్పందించాల్సి వచ్చింది. వెంటనే నిందితుడిపై బ్లాక్ మెయిల్, లైంగిక వేధింపుల, బెదిరింపులు కింద కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.