న్యూఢిల్లీ: కోలొకేషన్‌ కేసులో ఎన్‌ఎస్‌ఈ మాజీ సీఈవో చిత్రా రామకృష్ణను సీబీఐ ఆదివారం అరెస్ట్‌ చేసింది. ఢిల్లీలో ఆమెను అరెస్ట్‌ చేసిన అధికారులు అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి, సీబీఐ ప్రధాన కార్యాలయం లాకప్‌లో ఉంచారు. సోమవారం సీబీఐ కోర్టులో హాజరుపరచనున్నారు. సీబీఐ ప్రత్యేక కోర్టు శనివారం చిత్రా పెట్టుకున్న యాంటిసిపేటరీ బెయిల్‌ను తిరస్కరించిన మర్నాడే అధికారులు అరెస్ట్‌ చేయడం గమనార్హం. గత మూడు రోజులుగా అధికారులు ఆమె నివాసాల్లో తనిఖీలు నిర్వహించారు.

ఎన్ని ప్రశ్నలు వేసినా సరైన సమాధానం ఇవ్వలేదని తెలిసింది. ఎన్‌ఎస్‌ఈ కొలోకేషన్‌ కేసులో సీబీఐ 2018 నుంచి దర్యాప్తు చేస్తోంది. ఎన్‌ఎస్‌ఈ చీఫ్‌గా చిత్రా రామకృష్ణ అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టు సెబీ నివేదిక ఇటీవలే తేల్చడం ఈ కేసులో కీలక మలుపుగా భావించొచ్చు. ఒక అదృశ్య యోగితో ఆమె ఎన్‌ఎస్‌ఈకి సంబంధించి కీలక విధాన నిర్ణయాలను పంచుకోవడం, ఆమె నిర్ణయాల్లో యోగి పాత్ర ఉండడం బయటకొచ్చింది. ఇదే కేసులో ఎన్‌ఎస్‌ఈ గ్రూపు మాజీ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ ఆనంద్‌ సుబ్రమణియన్‌ను ఫిబ్రవరి 25న సీబీఐ అరెస్ట్‌ చేసింది.