ప్రేమించిన యువతి పెళ్లికి నిరాకరించిందని కక్షగట్టిన ప్రియుడు మాట్లాడుకుందామని పిలిచి దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన వనపర్తి జిల్లా ఖిల్లాఘనపు రం మండలం మానాజీపేటలో ఈ నెల 5న జరగగా 8వ తేదీ సాయంత్రం వెలుగు చూసింది. మానాజీపేటకు చెందిన బత్తని అంజన్న 20 ఏళ్లుగా కుటుంబంతో కలిసి శంషాబాద్‌ దగ్గర జీవనం సాగిస్తున్నాడు. అతని చిన్న కుమారుడు శ్రీశైలంకు మిత్రుల ద్వారా హైదరాబాద్‌లోని కాటేదాన్‌కు చెందిన కావటి వెంకటేశ్‌ కూతురు సాయిప్రియ(20)తో పరిచయమైంది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని శ్రీశైలం ఇరు కుటుంబాలకు చెప్పడంతో అమ్మాయి కుటుంబీకులు నిరాకరించారు. దీంతో సాయిప్రియ శంకర్‌తో మాట్లాడటం మానేసింది. తర్వాత కరోనా ప్రభావంతో రెండేళ్ల క్రితం శ్రీశైలం కుటుంబం మానాజీపేటకు వెళ్లింది.

సాయిప్రియ ఇంటికి రాకపోవడంతో మైలార్‌దేవ్‌పల్లి పోలీసుస్టేషన్‌లో ఆమె తండ్రి ఫిర్యాదు చేశారు. మిస్సింగ్‌ కేసు నమోదు చేసిన పోలీసులు బుధవారం ఖిల్లాఘనపురం పోలీసుల సహకారంతో శ్రీశైలంను అదుపులోకి తీసుకుని విచారించగా తానే చంపానని అంగీకరించాడు. గురువారం సంఘటనాస్థలానికి చేరుకుని తహసీల్దార్‌ సమక్షంలో మృతదేహాన్ని బయటకు తీసి అక్కడే పోస్టుమార్టం చేశారు.

మళ్లీ మాటలు కలిసి:

మూడు నెలల క్రితం ఇద్దరి మధ్య మళ్లీ మాటలు కలిశాయి. ఈ క్రమంలో నెల 5న సాయిప్రియ భూత్పూర్‌ వరకు రాగా అక్కడి నుంచి శంకర్‌ బైక్‌పై మానాజీపేటలోని తన షెడ్‌ సమీపంలోని గుట్ట వద్దకు తీసుకెళ్లాడు. పెళ్లి విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆగ్రహానికి గురైన శంకర్‌ సాయిప్రియ మెడలోని చున్నీతో గొంతు నులిమి చంపాడు. తన బంధువు శివతో కలిసి సమీపంలోని కేఎల్‌ఐ కాల్వ దగ్గర గుంత తవ్వి అందులో పూడ్చిపెట్టారు.