రంగారెడ్డి జిల్లా చేవేళ్ల మండలం పామెన గ్రామానికి చెందిన టీ శివశంకర్, పుష్పలత దంపతులకు 18 ఏళ్ల కుమార్తె సుప్రియ ఉంది. సుప్రియ మెయినాబాద్ మండలంలోని గ్లోబల్ కాలేజీలో బీఫార్మసీ చదువుకుంటోంది. కూతురంటే ఇద్దరు తల్లిదండ్రులకు ఎంతో ప్రేమ. ఏది అడిగినా క్షణాల్లోనే తెచ్చి ఇస్తుంటారు. అయితే ఇటీవల కుమార్తె ఎక్కువగా ఫోన్లో మాట్లాడుతుండటాన్ని తల్లి పుష్పలత గమనించింది. ఇదే విషయమై బుధవారం ఉదయం కూతురిని మందలించింది. ఫోన్లలో ఎవరితో మాట్లాడుతున్నావనీ, స్నేహితులైనంత మాత్రాన గంటల కొద్దీ మాట్లాడటం మంచిది కాదనీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

దీంతో సుప్రియ మనస్తాపానికి గురయింది. కుమార్తె అలిగి ఉంటుందనీ, కొద్ది సేపటి తర్వాత మామూలుగా అయిపోతుందిలే అని తల్లి పుష్పలత భావించింది. కొద్ది సేపటి తర్వాత సుప్రియ బాత్రూంలోకి వెళ్లిపోయింది. కూతురు బాత్రూంలోకి వెళ్లి చాలాసేపు అయినా తిరిగి బయటకు రాకపోవడంతో తల్లికి అనుమానం వచ్చింది. తల్లి వెళ్లి చూస్తే బాత్రూంలో కనిపించిన దృశ్యం చూసి షాకయ్యింది. కూతురు ఉరి వేసుకుని కనిపించింది. ఆమె కేకలను విన్న పక్కింటి వాళ్లు వచ్చి చూశారు. అప్పటికే సుప్రియ మరణించిందని తేల్చారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.