ప్రముఖ కన్నడ సినీ నటుడు విజయ్ రాఘవేంద్ర ఇంట తీవ్ర విషాదం నెల‌కొంది. ఆయ‌న భార్య స్పంద‌న సోమ‌వారం బ్యాంకాక్‌లో హ‌ఠాన్మ‌ర‌ణం చెందింది. మూడు రోజుల క్రితం ఆమె త‌న బంధువుల‌తో క‌లిసి బ్యాంకాక్ కు వెళ్ల‌గా ఈ ఉద‌యం మ‌ర‌ణించిన‌ట్లు కుటుంబ స‌భ్యులు తెలిపారు. ఆమె చ‌నిపోవ‌డానికి గుండెపోటు కార‌ణం అని అంటున్నారు. ఆమె వ‌య‌స్సు 44 సంవ‌త్స‌రాలు. ఆమె అకాల మ‌ర‌ణం కుటుంబ స‌భ్యుల‌తో పాటు శాండ‌ల్ వుడ్ ప‌రిశ్ర‌మ‌ను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆమె మృతి పట్ల ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో పాటు పలువురు సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం తెలిపారు.

స్పందన రిటైర్డ్ పోలీసు అధికారి బికె శివరామ్ కుమార్తె, కాంగ్రెస్ ఎమ్మెల్సీ బికె హరిప్రసాద్ మేనకోడలు. 2007లో ఆమె వివాహం విజయ్ రాఘవేంద్రతో జ‌రిగింది. ఈ జంట‌కు శౌర్య అనే కొడుకు ఉన్నాడు. 2016లో విడుద‌లైన అపూర్వ సినిమాలో స్పంద‌న న‌టించారు. త‌న భ‌ర్త న‌టించిన ప‌లు సినిమాల‌కు ఆమె నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించారు. ఆమె భౌతిక‌కాయం రేపు బెంగ‌ళూరుకు చేరుకోనున్న‌ట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, మ‌రో 19 రోజుల్లో విజ‌య్‌-స్పంద‌న‌ల జంట త‌మ 16వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకోనున్న తరుణంలో ఈ విషాద ఘ‌ట‌న చోటు చేసుకుంది.