ప్రపంచంలోని సంపన్న దేశాల్లో గుండె జబ్బులతో చనిపోయేవారికంటే క్యాన్సర్ వ్యాధితో చనిపోయేవారే ఎక్కువ. దీన్నిబట్టి ఆధునిక యుగంలో క్యాన్సర్ ఎంత వేగంగా మానవ జాతిని కబళిస్తోందో స్పష్టమవుతోంది. లాన్సర్ట్ మేగజీన్ ప్రపంచ వ్యాప్తంగా చావులపై చేసిన పరిశోధనలో మధ్యవయస్కుల్లో మరణాలకు క్యాన్సర్ కారణమని స్పష్టం చేసింది. ఈ క్యాన్సర్ లో మహిళలకు గర్భాశయ మరియు వక్షోజాల క్యాన్సర్ కారణం కాగా, మగవారిలో లివర్, ఊపిరితిత్తులు, ఉదర భాగం, పెద్దపేగు క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్, ప్రధాన కారణాలుగా పేర్కొంది. మగవారిలో అత్యథికులు లంగ్, లివర్ క్యాన్సర్ తో చనిపోయేవారేనని, వీటికి మద్యపానం, ధూమపానం ప్రధాన కారణాలని ఆ నివేదిక తెలిపింది.

మహిళల్లో వచ్చే వక్షోజ మరియు గర్భాశయ క్యాన్సర్లను సకాలంలో గుర్తిస్తే 90శాతం ప్రమాదం తప్పుతుందని పురుషుల్లో రెండోదశలో గుర్తిస్తే బ్రతికే అవకాశాలు 20శాతం కూడా ఉండటం లేదని పేర్కొంది. ఇటీవల కాలంలో ఎక్కువైన ఎముకల క్యాన్సర్ కు ఆహార పదార్థాల్లో ఉండే రసాయనాలే కారణం అని ఆ నివేదికలో బైటపడింది.

మంచి ఆహారం, వ్యాయామం, సకాలంలో నిద్ర, ఒత్తిడి తగ్గించుకోవడం, ధూమపానం, మద్యపానం దూరం పెట్టడం, ప్రధానంగా రసాయనాలకు దూరంగా ఆహారం తీసుకునే విధానం, నాగరిక సమాజంలో వచ్చే క్యాన్సర్లను అరికడతాయని ఆ నివేదిక పేర్కొంది. వంశ పారంపర్యంగా, జన్యుపరంగా వచ్చే క్యాన్సర్లకంటే ఆహార సంబంధంగా వచ్చే క్యాన్సర్లే ఎక్కువగా ఉన్నాయని ఆ నివేదిక తెలిపింది.