ఓ యువతి ఓ అంథుడిని ప్రేమించింది. పెద్దలు, స్నేహితులు వద్దని సలహాలు ఇచ్చినా అతడినే మనువాడింది. కులాంతర వివాహం చేసుకుంది. జీవితాంతం అతడికి తోడుగా ఉండేందుకు సిద్ధమయింది. చిత్తూరు జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి: చిత్తూరు జిల్లా తిరుపతికి చెందిన అశోక్ కుమార్ స్థానికంగా ఉన్న ఓ కోచింగ్ సెంటర్లో టీచర్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. అంథుడయినా అన్నింటా ముందుండేవాడు. అతడి తెలివితేటలను చూసి అందరూ అచ్చెరువునొందేవాళ్లు. తొట్టంబేడు మండలంలోని ఎస్టీ వర్గానికి చెందిన వీరమ్మ అనే యువతి కూడా అదే కోచింగ్ సెంటర్లో టీచర్స్ ట్రైనింగ్ తీసుకుంటోంది. ట్రైనింగ్ లో ఉండగానే అశోక్ ను చూసి వీరమ్మ మనసుపడింది. అతడి ప్రతిభను ఎన్నోసార్లు మెచ్చుకుంది. జీవితాంతం అతడితో కలిసి జీవించాలని ఆశపడింది. గుడ్డివాడిని పెళ్లి చేసుకుని ఏం సుఖపడతావని కొందరు మాటలు అన్నా ఆమె పట్టించుకోలేదు.

ప్రేమిస్తున్నానీ, పెళ్లి చేసుకుందామని అశోక్ తో చెప్పింది. మొదట వద్దని చెప్పిన అశోక్, ఆ తర్వాత వీరమ్మ ప్రేమకు కరిగిపోయాడు. వాళ్లిద్దరి కులాలు వేరయినా ఇద్దరూ కలిసి పెద్దలను ఒప్పించారు. మొదట అమ్మాయి తరపు వాళ్లు ఒప్పుకోకున్నా, చివరకు వాళ్లిద్దరి పట్టుదలను చూసి ఒప్పుకున్నారు. నగరిలో బుధవారం సిరిడీస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో వీరిద్దరి పెళ్లి జరిగింది. అంథుడయినప్పటికీ పెద్దలను ఒప్పించి మరీ అతడిని పెళ్లి చేసుకోవడాన్ని చూసి అందరూ వీరమ్మను, ఆ జంటను ప్రశంసిస్తున్నారు. భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు ఎదగాలని మనస్పూర్తిగా ఆకాంక్షించారు.