‌ఖేడ్‌లోని అంగన్‌వాడీ కేంద్రానికి పంపిణీ చేసిన గుడ్లలోంచి, తెల్లని పురుగులు రావడంతో చిన్నారుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. వివరాలు: ఖేడ్‌ పట్టణంలోని సాయినగర్‌కాలనీలో 3వ నెంబరు అంగన్‌వాడీ కేంద్రం ఉంది. గురువారం ఉదయం కొన్ని గుడ్లు పగిలి, వాటిలోంచి పురుగులు రావడాన్ని కార్యకర్త స్వరూపతో పాటు చిన్నారులు గుర్తించారు.

విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు వచ్చి పరిశీలించారు. ఇలాంటి తింటే చిన్నారుల పరిస్థితేంటని ఆవేదన చెందారు. గుడ్లు పంపిణీ చేసిన గుత్తేదారుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. గుత్తేదారు గతనెల 28న 450 గుడ్లు ఇచ్చినట్లు కార్యకర్త స్వరూప తెలిపారు.

విషయం తెలుసుకున్న స్థానిక ఐసీడీఎస్‌ సీనియర్‌ సహాయకులు శాంతకుమార్‌ కేంద్రాన్ని సందర్శించి గుడ్లను పరిశీలించారు.