గ్రామీణ ప్రాంత మహిళలకు చట్టాలపై అవగాహన లేక అనేక రకాల హింసను ఎదుర్కొంటున్నారని వారికి చట్టాలపై అవగాహన కల్పించాలని జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు శ్యామల ఎస్ కుంధార్ అన్నారు. ఈ సందర్భంగా భూపాలపల్లి పోలీసు స్టేషన్ లోని మహిళా కౌన్సిలింగ్ కేంద్రానికి శ్యామల ఎస్ కుందార్ సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు.

బాధిత మహిళలకు ఎలా కౌన్సిలింగ్ నిర్వహిస్తారో వారికోసం ఏర్పాటు చేసిన సౌకర్యాలు, న్యాయ సలహా, న్యాయ సంరక్షణ ఎలా చేస్తున్నారన్న విషయాన్ని అదనపు ఎస్పీ రాజమహేంద్ర నాయక్, ఎస్ఐ నిహారిక కుందార్ కు వివరించారు. అనంతరం కుందార్ మాట్లాడుతూ మహిళల కోసం ప్రత్యేక చట్టాలు ఉన్నాయని వాటిని సక్రమంగా అమలయ్యేలా మహిళలు సద్వినియోగం చేసుకునేలా అందరూ పనిచేయాలని షి టీమ్ ల ద్వారా మహిళల హక్కులపై చైతన్యం వచ్చేలా చేయాలని ఆమె సూచించారు.

అంతకుముందు పోలీస్ స్టేషన్ చేరుకున్న కుందార్ ను అడిషనల్ ఎస్పీ రాజమహేంద్ర నాయక్ మర్యాదపూర్వకంగా కలిసిన పుష్ప గుచ్చం అందించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రాజమహేంద్ర నాయక్, జాయింట్ కలెక్టర్ స్వర్ణలత, డీఎస్పీ కిరణ్ కుమార్, భూపాలపల్లి డిసిఆర్బి ఇన్స్పెక్టర్లు వాసుదేవరావు, దేవేందర్ రావు, ఎస్ఐ నిహారిక, రాకేష్, సాంబమూర్తి, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.