తెలంగాణలో గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం ఉద్యమంగా కొనసాగుతోంది. టిఆర్‌ఎస్ నాయకుడు, ఎంపి జోగినపల్లి సంతోష్‌కుమార్ ఇచ్చిన పిలుపుకు రాష్ట్రం నలుమూలల మంచి స్పందన లభిస్తోంది. ఈ కార్యక్రమం లో భాగంగా ఇటీవల హీరో వరుణ్ తేజ్ మొక్కలు నాటి హీరోయిన్ సాయిపల్లవికి గ్రీన్‌ఛాలెంజ్ విసిరారు. వరుణ్ తేజ్ విసిరిన ఛాలెంజ్‌కు గురువారం సాయిపల్లవి స్వీకరించారు.

ఆమె మొక్కలు నాటి ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ట్విట్టర్‌లో పదివేల మంది అభిమానులు, ఇన్‌స్టాగ్రామ్ లో రెండు లక్షల మంది ప్రతిరోజూ సాయిపల్లవిని అనుసరిస్తున్న వారిలో ఉన్నారు. దీంతో ఆమె ట్విట్టర్‌లో మొక్కలు నాటినట్లుగా పోస్టు చేసిన వెంటనే పెద్దసంఖ్య లో అభిమానులు సాయిపల్లవికి అభినందనలు తెలియజేశారు. కాగా గ్రీన్ ఛాలెంజ్‌ను హీరోయిన్ సమంతప్రభు, హీరో దగ్గుపాటి రాణాలకు విసిరారు.

ఈ విషయాన్ని ఆమె తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా సాయిపల్లవి మాట్లాడుతూ, ప్రతి ఒక్క రు మొక్కలు నాటి తెలంగాణకు హరితహారం కార్యక్రమం లో తమ వంతు పాత్ర పోషించాలని పిలుపునిచ్చా రు. అలాగే ఎంఎల్‌సి శేరిసుభాష్‌రెడ్డి కూడా ఎంపి సంతోష్‌కుమార్‌కు పిలుపుకు స్పందించి మొక్కలు నాటారు. అనంతరం శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్, హీరో నితిన్, మెదక్ జిల్లా కలెక్టర్‌ను మొక్కలు నాటాల్సిందిగా గ్రీన్‌ఛాలెంజ్ విసిరారు.