టీడీపీ అధినేత చంద్రబాబుకు సీఆర్డీఏ అధికారులు షాకిచ్చారు. ఉండవల్లి కృష్ణానది కరకట్టపై ఉన్న చంద్రబాబు నివాసాన్ని సీఆర్డీఏ అధికారులు కూల్చేందుకు సిద్ధమయ్యారు. మూడురోజుల క్రితం చంద్రబాబు ఇంటిని ఖాళీ చేయాలంటూ నోటీసులు ఇచ్చారు. వారంలోగా ఇళ్లు ఖాళీ చేయకపోతే చర్యలు తీసుకుంటామన్నారు. దీంతో ఇంటి యజమాని లింగమనేని రమేష్ సీఆర్డీఏ అధికారుల నోటీసులకు వివరణ ఇచ్చారు. అయినప్పటికీ ఇవాళ ఉదయం చంద్రబాబు నివాసం వద్దకు చేరుకున్న అధికారులు ఏక్షణమైనా ఇంటిని కూల్చేందుకు సిద్దమవుతున్నారు.

మరోవైపు చంద్రబాబు పక్కన ఉన్న ఇళ్లకు కూడా నోటీసులు అందించిన అధికారులు వాటిని కూల్చివేసే పనులు చేపట్టారు. గతంలో ఇచ్చిన నోటీసులకు ఇంటి యజమాని లింగమనేని ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేదన్నారు. ఇంటిలో గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్న డ్రెస్సింగ్ రూమ్, స్విమ్మింగ్ ఫూల్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారన్నారు. దీంతో చంద్రబాబు ఉంటున్న ఇల్లు అక్రమ కట్టడమని నిర్ధారణకు వచ్చామంటూ సీఆర్డీఏ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు.

సీఆర్డీయే చట్టానికి వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఇల్లు ఖాళీ చేయాలని అధికారులు చెబుతున్నారు. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తుతం అమరావతిలో లేరు. ఆయన హైదరాబాద్ వెళ్లినట్లు సమాచారం.