ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఏపీ మాజీ సీఎం చంద్రబాబు కేసు కదిలింది. హైదరాబాద్‌ లోని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ప్రత్యేక న్యాయస్థానం కేసు విచారణకు నిర్ణయించింది, 14 ఏళ్ల క్రితం ఏసీబీ కోర్టులో లక్ష్మీపార్వతి దాఖలు చేసిన కేసు ఇది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ కేసులో చంద్రబాబు స్టే గడువు ముగియడం, స్టే విష యంలో హైకోర్టు నుంచి ఎలాంటి పొడిగింపు లేకపోవడంతో కేసులో తదుపరి ప్రక్రియను ప్రారంభి స్తామని ఏసీబీ ప్రత్యేక కోర్టు జడ్జి సాంబశివరావు నాయుడు సోమ వారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఫిర్యాదుదారుగా ఉన్నలక్ష్మీపార్వతి సాక్ష్యాన్ని నమోదు చేయాలని నిర్ణయించి తదుపరి విచారణను ఈ నెల 25కి కోర్టు వాయిదా వేసింది. సివిల్, క్రిమినల్‌ కేసుల్లో స్టే ఆరు నెలలకు మించకూడదని సుప్రీంకోర్టు గత ఏడాది ఇచ్చిన తీర్పును, చంద్రబాబు స్టే గడువు ముగిసిన విషయాన్ని, ఆ స్టేకు ఎలాంటి పొడిగింపు లేకపోవడాన్ని జడ్జి తన ఉత్తర్వుల్లో పొందుపరిచారు. విచారణ సందర్భంగా చంద్రబాబు తరఫు న్యాయవాది జోక్యం చేసుకుంటూ, తదుపరి ఉత్తర్వులు వెలువరించేంత వరకు 2005లో హైకోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వులు కొనసాగుతాయని వాదించారు.

లక్ష్మీపార్వతి తరఫు న్యాయవాది సురేందర్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ, సివిల్, క్రిమినల్‌ కేసుల్లో స్టే అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గుర్తు చేశారు. ఆ స్టే పొడిగింపు ఉత్తర్వులు లేవని కోర్టుకు వివరించారు.