ఒంటిపై నల్లటి దుస్తులు, చేతిలో అధునాతన ఆయుధాలు, పరిసరాలపై డేగ చూపులు, అత్యంత ప్రముఖుల చుట్టూ దర్శనమిచ్చే ‘బ్లాక్‌ క్యాట్‌’ కమాండోలు ఇక జనబాహుళ్యంలో కనిపించరు. వీఐపీల రక్షణ బాధ్యతల నుంచి వీరిని పూర్తిగా ఉపసంహరించాలని కేంద్రం నిర్ణయించింది. ఫలితంగా తెదేపా అధినేత చంద్రబాబు సహా 13 మందికి ‘బ్లాక్‌ క్యాట్‌’ భద్రత ఉండదు. ఈ బాధ్యతలను త్వరలో పారామిలటరీ దళాలకు అప్పగిస్తారు. ఇప్పటికే ఈ దళాలు దాదాపు 130 మంది ప్రముఖులకు రక్షణ కల్పిస్తున్నాయి.

ఇప్పటికే దేశంలో 350 మంది ప్రముఖులకు భద్రతను కుదించడం, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు, గాంధీ కుటుంబానికి ప్రత్యేక భద్రతా దళ (ఎస్‌పీజీ) రక్షణను ఉపసంహరించడం వంటి చర్యలను కేంద్రం చేపట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు జాతీయ భద్రతా దళా (ఎన్‌ఎస్‌జీ)న్ని వీఐపీ రక్షణ విధుల నుంచి వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. ‘బ్లాక్‌ క్యాట్‌’లుగా పిలుచుకునే ఈ దళ కమాండోలు దాదాపు రెండు దశాబ్దాలుగా ప్రముఖుల రక్షణ విధుల్లో ఉన్నారు.

ప్రస్తుతం దేశంలో తీవ్ర ముప్పు ఎదుర్కొంటూ ‘జడ్‌ ప్లస్‌’ విభాగంలో ఉన్న 13 మంది వీఐపీల భద్రతను వీరే చూస్తున్నారు. ఇందుకోసం ఒక్కో ప్రముఖుడికి దాదాపు పాతిక మంది సిబ్బందిని ఎన్‌ఎస్‌జీ కేటాయించింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, ఉత్తర్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, అసోం ముఖ్యమంత్రి శర్వానంద సోనోవాల్‌, మాజీ ముఖ్యమంత్రులు చంద్రబాబు, మాయావతి, ములాయం సింగ్‌, ప్రకాశ్‌ సింగ్‌ బాదల్‌, ఫరూక్‌ అబ్దుల్లా, భాజపా సీనియర్‌ నేత ఎల్‌.కె.ఆడ్వాణీ తదితరులకు ఈ దళం రక్షణ కల్పిస్తోంది.