సొంత భర్త, మామ, మరిది, అత్త ,తోడి కోడలు , ఆడబిడ్డ ఇలా ఒకే కుటుంబంలోని వారందరినీ విష ప్రయోగం చేసి చంపిన జాలీ థామస్ పోలీస్ కస్టడీలో చెప్పిన విషయాలను విని కేరళ పోలీసులు నివ్వెరపోయారు. చంపడమంటే తనకెంతో ఇష్టమని చనిపోయిన వారి కోసం ఏడుస్తున్న వారిని చూసి తానెంతో సంతోషిస్తానని, ఆ వార్తలు పదేపదే చదివి ఆనందిస్తుంటానని ఆమె విచారణలో చెప్పింది. 14 ఏళ్ళ వ్యవధిలో సొంత కుటుంబంలో ఆరుగురిని చంపిన జాలీ థామస్ వ్యవహారం కేరళను వణికించింది.

అందరికీ ఆహారంలో స్లో పాయిజన్ ఇచ్చి చంపింది. విదేశాల్లో వున్న ఒక బంధువుకు ఈ చావులపై అనుమానాలు రావడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేసి విచారణకు నాంది పలికారు. మృతదేహాలన్నింటికీ సమాధుల నుంచి వెలికితీసి డీఎన్ఏ పరీక్షలు నిర్వహించగా సైనెడ్ ఉపయోగించి చంపినట్లు తేలింది. జాలీ థామస్ కూడా తన నేరాన్ని సంతోషంగా అంగీకరించింది.

తాను తాగుబోతునని, వివాహేతర సంబంధాలు అనేకమందితో వున్నాయని, విలాసంగా బతికేందుకు ఆస్తి కోసమే ఈ హత్యలు చేశానని ఒప్పుకుంది. ఇన్ని చావులు చూసిన తనకు ఇప్పుడు చావంటే కూడా భయం లేదని చెప్పింది.