నిజామాబాద్‌: ఓ వ్యక్తి నిర్లక్ష్యం ముక్కుపచ్చలారని చిన్నారిని చిదిమేసింది. కారు ముందున్న చిన్నారిని చూసుకోకుండా బండి తోలడంతో ఆమె ప్రాణాలు విడిచింది. జిల్లా కేంద్రంలోని కంటేశ్వర్ ప్రాంతం శివం అపార్ట్ మెంట్‌లో ఆదివారం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. వాచ్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్న వ్యక్తి, తన కుటుంబంతో కలిసి అపార్ట్‌మెంట్‌ సెల్లార్‌లో నివాసముంటున్నాడు. అక్కడే అపార్ట్‌మెంట్‌ వాసుల బైకులు, కార్లు పార్క్‌ చేస్తున్నారు. ఎప్పటిమాదిరిగానే 18 నెలల చిన్నారి మనస్వి తమ ఇంటి సమీపంలో ఆడుకుంటోంది.

దురదృష్టమేంటో ఈ రోజు ఆమె పార్క్‌ చేసి ఉన్న కార్ల వద్దకు వెళ్లింది. అంతలోనే ఓ వ్యక్తి తన కారును స్టార్ట్‌‌ చేసుకుని ముందుకువెళ్లడంతో చక్రాల కింద నలిగి మనస్వి విగతజీవిగా మారింది. కారు డ్రైవర్‌ నిర్లక్ష్యం, కుటుంబ సభ్యులు పాపను గమనించకపోవడంతో ఘోరం జరిగిపోయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా విచారిస్తున్నారు.