ఢిల్లీలో ట్రాఫిక్ చలాన్లు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. వాహనం తీసుకొని బయటకు వెళితే చాలు ఎడాపెడ ఫైన్లు మోగించేస్తున్నారు. కొంత మంది అయితే జరిమానాలు కట్టలేక వాహనాలు వదిలేసి వెళ్తున్నారు. తాజాగా ఓ యువతి ట్రాఫిక్ పోలీసులకు చుక్కలు చూపించింది. తనకు చలానా రాస్తే ఉరేసుకొని చనిపోతానంటూ బెదిరించింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కశ్మీరీ‌గేట్ సమీపంలో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన ఒక యువతిని పోలీసులు అడ్డుకున్నారు. ఆమె స్కూటీకి నంబర్ ప్లేటు సరిగాలేదు.

పైగా ఫోన్ మాట్లాడుతూ వెళ్లడాన్ని వారు గుర్తించారు. వెంటనే ఆమెను ఆపి జరిమానా వేసేందుకు సిద్ధమయ్యారు. ఈ ఘటనపై ఆగ్రహానికి గురైన ఆ యువతి వెంటనే తన హెల్మెట్‌ను నేలకేసి కొట్టింది. ఈ ఘటనతో పోలీసులు ఆశ్చర్యానికి గురయ్యారు. జరిమానా వేస్తారని గ్రహించిన ఆ యువతి బైక్‌కు తాళం వెసి అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు తాళం చెవి తీసుకున్నారు. కోపంతో ఆమె హెల్మెట్ తీసి నేలకెసి కొట్టింది. తన బైక్ నంబర్ ప్లేట్ ఎవరో విరగ్గొట్టారని చెబుతూ ఏడ్వటం ప్రారంభించింది. చలానా రాస్తే తాను ఉరేసుకుంటానని బెదిరించింది. ఈ వివరాలు తల్లికి కూడా ఫోన్ చేసి చెప్పింది. చేసేదేమిలేక పోలీసులు ఆమెకు ట్రాఫిక్ నిబంధనలు వివరించి జరిమానా వేకుండానే వదిలేశారు.