నంద్యాల పట్టణంలోని మాల్దార్ పేటకు చెందిన మనీషా అనే 20 ఏళ్ల యువతి తల్లిదండ్రులు చిన్నప్పుడే మరణించారు. దీంతో ఆమె బాగోగులను ఆమె మేనమామే చూసుకున్నాడు. ఇంటర్మీడియట్ వరకు చదివించాడు. 20 ఏళ్ల వయసులో ఆమెకు పెళ్లి చేశాడు. నంద్యాల పట్టణంలోనే చింతరుగు వీధికి చెందిన రాజేష్ అనే వ్యక్తితో జనవరిలో మనీషా పెళ్లి జరిగింది. అతడు మెడికల్ రిప్రజెంటేటివ్ గా పనిచేస్తుంటాడు. పెళ్లి సమయంలో అబ్బాయి తరపు వాళ్లు అడిగినంత కట్నం ఇచ్చారు. దాదాపు 15 లక్షల రూపాయల కట్నంతోపాటు 20 తులాల బంగారాన్ని కూడా ఆమెకు కానుకగా ఇచ్చి ఘనంగా పెళ్లి చేశారు. తల్లిదండ్రులు లేని పిల్ల అని బాగా చూసుకోవాల్సిన భర్తే, ఆమెపై వేధింపుల పర్వాన్ని మొదలు పెట్టాడు. తన వ్యాపారం కోసం అదనపు కట్నం తేవాలని ఆమెను హింసించాడు.

తన కోసం ఇప్పటికే తన మామయ్య ఎన్నో త్యాగాలు చేశాడనీ, తనను చదివించి, భారీగా ఖర్చు పెట్టి పెళ్లి కూడా చేశాడనీ, ఇప్పుడు అదనపు కట్నం కోసం తనను హింసిస్తున్నారని మేనమామతో చెప్పలేనని మనీషా ఆవేదనకు గురయింది. పెళ్లయిన మూడు నెలల్లోనే ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన గురించి తెలిసిన మేనమామ మహేష్ కన్నీటిపర్యంతమయ్యాడు. మనీషా భర్త రాజేశ్, అతడి కుటుంబ సభ్యులపై కేసు పెట్టాడు. వ్యాపారం చేస్తున్నాడు కదా, కోడలి భవిష్యత్ బాగుంటుంది కదా అని పెళ్లి చేస్తే ఆమెను చిత్రహింసలకు గురిచేస్తాడని తాను ఊహించలేకపోయానని వాపోయాడు. తనకు ఫోన్ చేసి విషయం చెప్తే ఏదో ఒకటి చేసేవాడిని కదమ్మా అంటూ గుండెలు పగిలేలా ఏడ్చాడు.