టాలీవుడ్‌ అగ్ర హీరోలు చిరంజీవి, రామ్‌ చరణ్‌పై ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వంశీయులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిరంజీవి కథానాయకుడిగా రూపుదిద్దుకుంటోన్న ‘సైరా’ చిత్రం కథ విషయంలో తమతో ఒప్పందం చేసుకొని, మోసం చేశారని ఆరోపిస్తూ జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు పెట్టారు. నరసింహారెడ్డి కథను తమనుంచి సేకరించి, తిరిగి తమపైనే తప్పుడు కేసులు పెట్టారని వారు ఆరోపించారు. కథను తీసుకున్నందుకు డబ్బులు ఇస్తామని చెప్పి ఇప్పుడు మోసం చేశారని ఆరోపిస్తూ ఉయ్యాలవాడ వంశస్థులు జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ‘సైరా’ను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ బ్యానర్‌పై రామ్‌ చరణ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నయనతార, తమన్నా, అమితాబ్‌ బచ్చన్‌, విజయ్‌ సేతుపతి, సుదీప్‌, జగపతిబాబు తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. అక్టోబర్‌ 2న ఈ చిత్రం విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్‌, ట్రైలర్‌ విడుదలై విశేష జనాదరణ పొందాయి.