మహిళల రక్షణ కోసం చర్యలు తీసుకుంటున్నప్పటికి వారిపై అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. సభ్యసమాజం తలదించుకునేల వావి వరుసలు మరిచి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా నిజామాబాద్ జిల్లా బోధన్‌లో ఓ కామాంధుడు బాబాయ్ కుమార్తెపై స్నేహితుడితో కలిసి లైంగిక దాడికి పాల్పడిన సంఘటన చోటుచేసుకుంది.

బీటీ నగర్‌లో నివశించే 19 ఏళ్ల యువతి 10వ తరగతి అనంతరం చదువు మానేసింది. స్పల్ప వైకల్యం ఉండటంతో ఆమెను ఇంటి దగ్గర ఉండమని చెప్పి తల్లిదండ్రులు రోజూ కూలి పనులకు వెళ్లేవారు. దీంతో ఒంటిరిగా ఉన్న యువతిపై ఆమె పెదనాన్న కొడుకు నవీన్‌(25), స్నేహితుడు రవి(22)  బెదిరించి అత్యాచారానికి పాల్పడేవారు. ఆమె శరీరంలో మార్పులు రావడంతో విషయాన్ని తల్లిదండ్రులు పసిగట్టగలిగారు.

ప్రస్తుతం యువతి 5 నెలల గర్భిణి. కుల పెద్దలు విషయం బయటకు పొక్కకుండా రాజీ చేసే ప్రయత్నం చేశారు. కానీ బాధితులు వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశీ సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.