వారానికి మూడు సార్లు చేపను ఆహారంగా తీసుకుంటే క్యాన్సర్‌ ముప్పు గణనీయంగా తగ్గుతుందని తాజా అధ్యయనం వెల్లడించింది. వారానికి ఒకసారి చేపను తినేవారితో పోలిస్తే మూడు సార్లు తీసుకునేవారిలో పేగు క్యాన్సర్‌ ముప్పు 12 శాతం తక్కువగా ఉందని ఈ పరిశోధన వెల్లడించింది. అన్ని రకాల చేపలను తీసుకోవడం మంచిదే అయినా నూనె అధికంగా ఉండే సాల్మన్‌, మాకరెల్‌ చేపల కంటే ఇతర చేపలు మరింతగా ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయని తేలింది.

చేపల్లో ఉండే కొవ్వు ఆమ్లాలు శరీరంలో వాపును తగ్గిస్తాయని యూనివర్సిటీ ఆఫ్‌ ఆక్స్‌ఫర్డ్‌ పరిశోధకులు పేర్కొన్నారు. శరీరంలో వాపు ప్రక్రియ డీఎన్‌ఏను ధ్వంసం చేయడం ద్వారా క్యాన్సర్‌కు దారితీస్తుందని గత అధ్యయనాల్లో వెల్లడైన సంగతి తెలిసిందే. యూనివర్సిటీ ఆఫ్‌ ఆక్స్‌ఫర్డ్‌, ఇంటర్నేషనల్‌ ఏజెన్సీ ఫర్‌ రీసెర్చ్‌ ఆన్‌ క్యాన్సర్‌ (ఐఏఆర్‌సీ) సంయుక్తంగా ఈ పరిశోధన చేపట్టాయి.

తరచూ చేపలను తినేవారిలో నేరుగా క్యాన్సర్‌ ముప్పు గణనీయంగా తగ్గినట్టు వెల్లడైందని, ఆరోగ్యకర ఆహారంలో చేపలను పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని పరిశోధనకు నేతృత్వం వహించిన డాక్టర్‌ మార్క్‌ గుంటర్‌ అన్నారు. ప్రజలు పొగతాగడం మాని బరువును తగ్గించుకుని ఆరోగ్యకర ఆహారం తీసుకుంటే క్యాన్సర్‌ కేసులను 40 శాతం వరకూ నిరోధించవచ్చని నిపుణులు చెబుతున్నారు.