జనగామ జిల్లాలో మళ్లీ కరోనా వైరస్‌ విజృంభణతో కలకలం చెలరేగింది. గతంలో జనగామ, నర్మెట మండలం వెల్దండ, బచ్చన్నపేట మండలం బండనాగారం గ్రామాలకు చెందిన ముగ్గురికి కరోనా వైరస్‌ సోకగా బాధితులను హైదరాబాద్‌ గాంధీ హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందించడంతో కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఈ నేపథ్యంలో తాజాగా రఘునాథపల్లి మండలంలోని నిడిగొండలో భార్యాభర్తలు ఇరువురికి కరోనా సోకినట్లు వైద్యులు వెల్లడించడంతో స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. నిడిగొండకు చెందిన కొందరు ఉపాధి కోసం మహారాష్ట్రలోని ముంబైకి కొన్నేళ్ల క్రితం వలసవెళ్లారు.

రెండు రోజుల క్రితం వారు స్వగ్రామానికి చేరుకున్నారు. వీరిని అధికారులు హోంక్వారంటైన్‌లో ఉంచగా ఇద్దరికి కరోనా లక్షణాలు కనిపించడంతో వెంటనే హైదరాబాద్‌లోని కింగ్‌కోఠి హాస్పిటల్‌కు తరలించి వైద్యపరీక్షలు నిర్వహించారు. ఈ క్రమం లో వలసకూలీల్లో దంపతులిద్దరికీ పాజిటివ్‌ రిపోర్టు రావడంతో వారికి చికిత్స అందిస్తున్నారు. వీరు ఎవరెవరితో కలిసి ఉన్నారనే అంశాలపై స్థానిక అధికారులు పరిశీలిస్తున్నారు. తాజా పరిణామాలతో ప్రజాప్రతినిధులు, అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.