టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్ త్వరలోనే వరంగల్‌లో పర్యటించనున్నారు. జనవరి 4న ఆయన పర్యటన షెడ్యూల్ ఖరారైంది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌లోని పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు కేటీఆర్. ఈ నేపథ్యంలో జిల్లా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమీక్ష నిర్వహించారు. పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఏయే పనులు ఎలా చేయాలనే దానిపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఉగాది నుంచి వరంగల్ లో ప్రతి ఇంటింటికీ మంచినీటిని ప్రతి రోజూ ఇవ్వాలన్న నిర్ణయంలో భాగంగా 45వేల కొత్త కనెక్షన్లు ఇవ్వాల్సి ఉండగా, ఇప్పటికే ఇచ్చిన కనెక్షన్లు పోను ఇంకా, 24వేల కొత్త కనెక్షన్లు ఇవ్వాల్సి ఉందని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు.

నగరంలో ఇటీవలి వరదలకు కొట్టుకుపోయిన, చెడిపోయిన రోడ్ల మరమ్మతుల కోసం ఆ రోజు తీసుకున్న నిర్ణయంలో భాగంగా పంచాయతీరాజ్, ఐటీడిఎ శాఖల ఇంజనీర్లు, రిటైర్డ్ ఇంజనీర్లను డిప్యూట్ చేసుకోవాలని మంత్రి ఆదేశించారు. దేశంలో ఏ నగరానికి లేని విధంగా మంచినీటిని వరంగల్ కి అందచేస్తున్నట్లు మంత్రి ఎర్రబెల్లి వివరించారు. అలాగే మున్సిపాలిటీలోని అంతర్గత రోడ్లు, మురుగునీటి కాలువలు, పారిశుద్ధ్యం, పార్కులు, ప్రణాళికా బద్ధంగా నగర నిర్మాణం, భవిష్యత్ ప్రణాళికలు, భవిష్యత్తులో చేపట్టబోయే పనులు, సత్వరమే పూర్తి చేయాల్సిన పలు పనులపైనా మంత్రి వివరంగా అధికారులతో చర్చించారు.
ఇదిలా ఉంటే షెడ్యూల్ ప్రకారం వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు మరో రెండు నెలల్లో జరగాల్సి ఉంది. దీంతో అధికార టీఆర్ఎస్ వరంగల్‌పై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఓ వైపు ప్రభుత్వ కార్యక్రమాలను సమీక్షిస్తూనే ఎన్నికలు పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడంపై టీఆర్ఎస్ దృష్టి పెట్టనుంది. దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ నుంచి తీవ్ర పోటీ ఎదురుకావడం, వరంగల్‌పై బీజేపీ కూడా ఫోకస్ చేయడంతో వరంగల్‌లో పట్టు చేజారిపోకుండా ఉండేందుకు టీఆర్ఎస్ ఇప్పటి నుంచే చర్యలు తీసుకోనుందని తెలుస్తోంది..